'మారో' అంటున్న నితిన్

నితిన్, మీరాచోప్రా జంటగా నటించిన చిత్రం 'మారో'. తొలుత ఈ చిత్రానికి 'సత్యం శివం సుందరం' అనే టైటిల్ పెట్టారు. కారణాంతరాల వల్ల విడుదలలో కొద్దిపాటి జాప్యం తలెత్తినప్పటికీ ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళ దర్శకుడు సిద్ధిక్ తొలిసారి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. మామిడాల శ్రీనివాస్, కె.సాగర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.లవ్, సెంటిమెంట్, యాక్షన్, వినోదం, సస్పెన్స్ అన్నీ కలగలిసిన చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. నితిన్ బాడీలాంగ్వేజ్ కు అన్నివిధాలా సరిపోయే టైలర్ మేడ్ పాత్రను ఇందులో పోషించారనీ, ఐఐటి కాలేజీ విద్యార్ధిగా అతను కనిపిస్తాడనీ, తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అతను బుద్ధిబలంతో ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కథ చెప్పారు. మీరాచోప్రా గ్లామర్ తో కూడిన నటన ప్రదర్శించిందని అన్నారు. డిసెంబర్ లో ఆడియో విడుదల చేసి అదే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. మలయాళంలో తొమ్మిది, తమిళంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన తనకు తెలుగులో ఇది తొలి చిత్రమని సిద్దిఖ్ తెలిపారు. చక్కటి కథ, కథనాలతో రియాలిటీకి దగ్గరగా ఈ చిత్రం ఉంటుందనీ, మణిశర్మ సంగీతం హైలైట్ గా నిలుస్తుందనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, వేణుమాధవ్, రఘుబాబు, రాజ్యలక్ష్మి, నరసింహారావు, రమాప్రభ, అబ్బాస్ తదితరులు నటించారు. చింతపల్లి రమణ మాటలు, జయరామ్ సినిమాటోగ్రఫీ, టి.ఆర్.శేఖర్ ఎడిటింగ్ అందించారు.

No comments:

Post a Comment