మాస్ ఇమేజ్ ఒక్కోసారి కత్తిమీద సాము అవుతుంటుంది. మాస్ హీరోలకు ఉన్న క్రేజ్ సామాన్యమైనది కాకపోయినా ఒక సినిమా హిట్టయితే ఆ లైన్స్ లోనే హీరోలను ఫోకస్ చేసేందుకు దర్శకనిర్మాతలు తహతహలాడుతుంటారు. హీరోలు సైతం ఆ చట్రం నుంచి ఎప్పుడో కానీ బయటకు రావడానికి ఇష్టపడరు. దీంతో హీరోలకూ, చూసే ప్రేక్షకులకూ మొనాటనీ సమస్య ఎదురవుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు కొద్దిపాటి మార్పును ఆహ్వానిస్తున్నట్టు ఆయన తదుపరి చిత్రాలను బట్టి అనుకోవచ్చు. 'బిల్లా' చిత్రం లాభనష్టాల సమస్య లేకుండా గట్టెక్కడం, 'ఏక్ నిరంజన్' యావరేజ్ అనిపించుకోవడంతో ప్రభాస్ ఇప్పుడు తన వయసుకు తగ్గ రొమాంటిక్ పాత్రల వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ప్రస్తుతం 'డార్లింగ్' అనే లవ్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. 'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' వంటి ప్రేమకథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ మరో ప్రేమకథా ఇతివృత్తింగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ అంగీకరించిన మరో చిత్రం కూడా రొమాంటిక్...ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందని సమాచారం.ప్రభాస్ కథానాయకుడుగా 'సంతోషం' ఫేమ్ దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈనెల 27న ఈ కొత్త చిత్రం ప్రారంభమవుతుంది. ఇందులో సారాజైన్, తపసి అనే కొత్తమ్మాయిలను హీరోయిన్లుగా దిల్ రాజు ఎంపిక చేశారు. రూటు మార్చిన ప్రభాస్ రొమాన్స్ లోనూ రఫ్పాడిస్తాడేమో?!
No comments:
Post a Comment