హాలీవుడ్ చిత్రం 'అవతార్' అనువాద హక్కులను 'ఠాగూర్' మధు దక్కించుకున్నారు. 'ఠాగూర్' చిత్రం తర్వాత అల్లు అరవింద్ తో కలిసి హిందీ 'గజనీ' చిత్రాన్ని మధు నిర్మించారు. ఇటీవలే రైట్స్ తీసుకుని 'మహాత్మ' చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా రిలీజ్ చేశారు. తాజాగా 'అవతార్' చిత్రం రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం రైట్స్ కోసం ఎందరో నిర్మాతలు పోటీపడినప్పటికీ చివరకు ఆ హక్కులు తమకు దక్కడం సంతోషంగా ఉందని మధు తెలిపారు. చిత్ర విశేషాలను ఆయన ముచ్చటించారు.హాలీవుడ్ లో ఇటీవల క్రేజ్ తెచ్చుకున్న చిత్రాల్లో 'అవతార్' టాప్ ప్లేస్ లో ఉందనీ, ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే భారీ అంచనాలు మొదలయ్యాయనీ చెప్పారు. 'టైటానిక్' ఫేమ్ జేమ్స్ కామరూన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. రాముడినీ, హిందూ పురాణాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారనీ, 'టైటానిక్' విడుదలైన 12 ఏళ్లకు జేమ్స్ కామరూన్ నుంచి వస్తున్న చిత్రమిదనీ తెలిపారు. తొలుత 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ అవుతుందని అంచనాలు వేసినప్పటికీ సినిమా పూర్తయ్యేసరికి 300 మిలియన్ డాలర్లు అవుతుందని అనుకోవడంతో నిర్మాణానికి అప్పట్లో బ్రేక్ పడిందనీ, అయితే ఆ చిత్రాన్ని ఎప్పటికైనా నిర్మించాలనే పట్టుదలతో 2006లో జేమ్స్ ఈ సినిమా ప్రారంభించారనీ చెప్పారు. 60 శాతం కంప్యూటర్ మాయాజాలం, 40 శాతం లైవ్ యాక్షన్ ల సమాహారంతో ఈ చిత్రం రూపొందినట్టు చెప్పారు. హాలీవుడ్ లో ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు వీక్షించే అవకాశం రానున్నదనీ, డిసెంబర్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నామనీ మధు తెలిపారు.
No comments:
Post a Comment