కాలం కలిసొస్తే నడిచొచ్చే కారు మాత్రమే కాదు...అందులోంచి అందమైన వరుడు కూడా కాలు కింద పెడతాడు. దక్షిణాదిన కొద్దికాలం పాటు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన గ్లామర్ తార రంభ త్వరలోనే పెళ్లి పీటలు మీద కూర్చోబోతోందట. కెరీర్ పరంగా ఇటీవల కాలంలో రంభ కొద్దిగా వెనకబడింది. నిర్మాతగా మారి చేతులు కూడా కాల్చుకుంది. అయితే మళ్లీ చిన్నా చితకా సినిమాలు, హీరోలతో నటిస్తూ తానింకా రేసులోనే ఉన్నానని రంభ చాటుకుంది. ఈమధ్యనే హాలీవుడ్ చిత్రం 'క్విక్ గన్ మురుగన్' లో అవకాశం దక్కించుకుని ఆందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదే తరుణంలో రంభను కెనడాకు చెందిన 'మ్యాజిక్ వుడ్స్' సంస్థ తమ సరికొత్త ప్రోడక్ట్ కు రంభను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకోవడమూ సంచలనమైంది. ఆ సంస్థ నుంచి ఇటీవల కోటిన్నర రూపాయలు విలువ చేసే ఖరీదైన కారు రంభ ఇంటిముందు వాలింది. అది రంభకు 'మ్యాజిక్ వుడ్స్' గిఫ్ట్ అన్నమాట. వావ్...అని అంతా ఆశ్చర్యపోయే లోపే ఇప్పుడు రంభకు పెళ్లి కూడా సెటిలైందంట.రంభ పెళ్లి చేసుకోనుందంటూ గతంలోనూ పలుమార్లు వినిపించినప్పటికీ ఈసారి మాత్రం ఖాయం అంటూ బలంగా వినిపిస్తోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. రంభకు కారిచ్చిన సంస్థ యజమానే మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేసి ఒప్పించారట. ఆయననే డిసెంబర్ 27న రంభ వివాహం చేసుకోనుందని అంటున్నారు. ఎప్పటికైనా ఆడపిల్ల ఈడపిల్ల కాదని అన్నట్టు పెళ్లి చేసుకున్న తర్వాత రంభ సైతం కెనడాకు షిఫ్ట్ అయిపోతుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం రంభ ఈ పెళ్లి వార్తలపై ఇంకా స్పందించలేదు.
No comments:
Post a Comment