తమిళ స్టార్ హీరో విక్రమ్ కొద్దికాలంగా ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు పట్టుదలగా ఉన్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు కూడా చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ కోసం ఎస్.ఎస్.రాజమౌళితో ఇటీవల రెండు రోజుల పాటు ఆయన స్టోరీ డిస్కషన్స్ చేసినట్టు సినీ వర్గాల భోగట్టా. విక్రమ్ హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ ఇటీవల లడక్ లో జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసిన విక్రమ్ ఈమధ్యనే హైద్రాబాద్ వచ్చి వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి 15 లక్షలు అందజేశారు. అదే రోజు సాయంత్రం రాజమౌళి సెన్సేషన్ హిట్ 'మగధీర' స్పెషల్ షో కూడా చూశారు. దీంతో రాజమౌళితో విక్రమ్ తదుపరి చిత్రం ఉండబోతోందనే వార్తలకు బలం చేకూరింది. అందుకు తగ్గట్టే విక్రమ్ ఆహ్వానం మేరకు ఆయనను ఇటీవల లడక్ లో రాజమౌళి కలుసుకున్నట్టు తెలుస్తోంది.రాజమౌళి ఓ స్క్రిప్టు సైతం వినిపించారనీ, ప్రస్తుతం విక్రమ్, రాజమౌళి అంగీకరించిన ప్రాజెక్ట్ లు పూర్తి కాగానే 2010 జూన్ లో ఈ సూపర్ కాంబినేషన్ చిత్రం సెట్స్ పైకి వస్తుందనీ తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. రాజమౌళి ప్రస్తుతం సునీల్ కథానాయకుడుగా 'మర్యాద రామన్న' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సైతం సెల్వరాఘవన్ తో చేస్తున్న సినిమా తర్వాతవిక్రమ్ కె కుమార్ చిత్రం, సిద్ధిఖ్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నట్టు తెలుస్తుంది. తమిళ 'భీమ', 'మల్లన్న' చిత్రాల కోసం చెరో రెండేళ్లు వెచ్చించినప్పటికీ సరైన ఫలితం రాకపోవడం ఇక నుంచి ఏడాదికి రెండు, మూడు చిత్రాలు చేయాలనే పట్టుదలతో విక్రమ్ ఉన్నారు. చియాన్ నిర్ణయం ఆయన అభిమానులను సైతం సంబరంలో ముంచెత్తుతోంది
No comments:
Post a Comment