టైమ్స్ ఇన్ కార్పొరేషన్ కు చెందిన పాపులర్ అమెరికన్ మ్యాగజైన్ 'పీపుల్' సౌత్ స్పెషల్ కవర్ పేజీపై యువహీరో రామ్ చరణ్ తేజ చోటు సంపాదించుకున్నారు. బంజారాహిల్స్ లోని ల్యాండ్ మార్క్ బుక్ స్టోర్ లో జరిగిన కార్యక్రమంలో రామ్ చరణ్ ఈ డిసెంబర్ సంచికను ఆవిష్కరించారు. 'పీపుల్' కవర్ పై చోటుచేసుకున్న తొలి తెలుగు నటుడు రామ్ చరణ్ కావడం విశేషం. అనంతరం 'పీపుల్'తో తన ఇంటర్వ్యూ గురించి మీడియాతో ఆయన ముచ్చటించారు.అమెరికాలో ఉన్నప్పుడు తాను పీపుల్ మ్యాగజైన్ చదివే వాడిననీ, ఇప్పుడు ఇండియన్ వెర్షన్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందనీ రామ్ చరణ్ అన్నారు. ఏడు దశాబ్దాల మ్యాగజైన్ చరిత్రలో గాసిప్ లు, ఊహాగానాలు ఎప్పుడూ చోటుచేసుకోలేదనీ, నికార్సయిన వార్తలు, ఇంటర్వ్యూలు మాత్రమే ఇందులో ప్రచురితమవుతాయనీ అన్నారు. సౌత్ స్పెషల్ మ్యాగజైన్ కవర్ పేజీ కథనంలో తాను చోటుచేసుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉందని అన్నారు. 'మగధీర' రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్ పై చరణ్ తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాన్నగారి అభిమానులు తన నుంచి ఎంతో ఎక్స్ పెక్ట్ చేస్తున్నందున తాను కొంత టెన్సన్ పడ్డాననీ, 'మగధీర' విడుదలైన అనంతరం నాన్నగారు తన దగ్గరకు వచ్చి బలంగా హత్తుకున్నారనీ ఆయన తన సంబరాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కాఫీ షాట్స్ కు వెళ్లడం, అమ్మ, చెల్లాయిలతో షాపింగ్ చేయడం తనకెంతో ఇష్టమనీ, ఇప్పుడు అవకాశం చిక్కడం లేదనీ చెప్పారు. తన తదుపరి చిత్రమైన 'ఆరంజ్' గురించి అడిగినప్పుడు, సస్పెన్స్ ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేయగలుగుతామనీ, త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నాననీ చెప్పారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ, ఇందులో తాను చాలా కొత్తగా కనిపిస్తాననీ, ఇంతకు మించి ఇప్పుడే ఏమీ చెప్పలేననీ ఆయన చిరునవ్వులు చిందించారు.
No comments:
Post a Comment