కరిష్మా కోఠక్ ('శంకర్ దాదా జిందాబాద్' ఫేమ్) ప్రధాన పాత్రలో జనం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పి.సత్యారెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'గ్లామర్'. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలోబ బుధవారంనాడు జరిగింది. రాష్ట్ర మంత్రి మాణిక్య వరప్రసాద్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని ఎమ్మెల్యే మస్తాన్ వలీ, పోలీస్ ఐ.జి. గోపీనాథరెడ్డికి అందజేశారు. బాంబే రవి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైంది.సత్యారెడ్డి పలు మంచి అంశాలతో చిత్రాలు తీశారనీ, ఈ చిత్రం కూడా ఆ తరహాలో ఉంటుందని ఆశిస్తున్నామనీ, ఆడియోతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని అతిథులు అన్నారు. నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం మాట్లాడుతూ, జనంతో మమేకమయ్యే సత్యారెడ్డి గతంలో సామాజిక అంశాలతో కూడిన పలు చిత్రాలు తీశారనీ, గ్లామర్ చిత్రంలో కూడా సందేశాన్ని ఆవిష్కరించారనీ, సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందనీ అన్నారు. ఇంతవరకూ 16 సినిమాలను తాను నిర్మించినట్టు దర్శకనిర్మాత సత్యారెడ్డి చెప్పారు. వీటిలో ప్రత్యూష కథాంశంతో ఓ సినిమా, ఫ్యాక్షన్ నేపథ్యంలో మరో సినిమా, అయ్యప్పకు సంబంధించిన ఇంకో సినిమా వంటివి ఉన్నాయని అన్నారు. వ్యాపార అంశాలను మిళితం చేస్తూ సందేశాత్మకంగా 'గ్లామర్' చిత్రాన్ని మలిచినట్టు ఆయన చెప్పారు. ఇందులో ఆరు పాటలు ఉన్నాయని బాంబే రవి తెలిపారు. ఈ వేడుకలో బెల్లంకొండసురేష్, యూత్ కాంగ్రెస్ నాయకుడు కిరణ్ కుమార్, నటి ఫరాఖాన్, బండ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment