అరు సినిమాల్లో ఐదు హిట్లు. పాటలు, ఫైట్స్, డాన్స్ లలో ఆయన స్టయిలే వేరు. అభిమానులకు ఆయన స్టయిలిష్ స్టార్. ఈ క్రెడిట్ అల్లు అర్జున్ దే. హిట్ల పరంగా 'ఆర్య-2' చిత్రంతో డబుల్ హ్యాటిక్ కొట్టేందుకు ఆయన ఈనెల 27న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల కాలంలో క్రేజ్ ఎక్కువగా ఉండే సినిమాలను చిత్రయూనిట్, టాలీవుడ్ ప్రముఖుల కోసం స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహిస్తున్నారు. 'ఆర్య-2' ప్రీమియర్ ను గురువారం రాత్రి హైద్రాబాద్ లోని సినీమాక్స్ లో ప్రదర్శించనున్నారు. అల్లు అర్జున్, కాజల్ తదితర చిత్ర తారాగణంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారు.ఫీల్ మై లవ్...అంటూ అల్లు అర్జున్ చేసిన అల్లరి అప్పట్లో 'ఆర్య' చిత్రానికి ఘనవిజయం సాధించి పెట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం సీక్వెల్ అలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందా అనేది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా ఇది కావడంతో ఆయనకు ఓ సంచలన హిట్ అనివార్యం. ఇవాల్టి హీరోల రేసులో అల్లు అర్జున్ పొజిషన్ ను స్ట్రాంగ్ చేయడానికి కూడా ఈ చిత్ర ఫలితం ఉపకరిస్తుంది. అలాగే 'మగధీర' సంచలన విజయం తర్వాత హీరోయిన్ కాజల్ కు సైతం ఈ చిత్రం కీలకం కాబోతోంది. తొలి వెర్షన్ లో నటించిన శివబాలాజీ ప్లేస్ లో ఇప్పుడు నవదీప్ నటించగా, శ్రద్ధాదాస్ మరో గ్లామర్ అట్రాక్షన్ కానుంది. 'ఆర్య' చిత్రం అప్పట్లో మ్యూజికల్ హిట్ అయినట్టే 'ఆర్య-2' చిత్రానికి దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఇప్పుడు సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. 'రింగా...రింగా' సాంగ్ తో కుర్రకారు కేరింతలు కొడుతున్నారు. 2.35 గంటల నిడివి గల ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య బాబు 20 కోట్లకు పైగా వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. 'ఆర్య-2' ఎలాంటి సంచలనం సృష్టించనుందనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది.
No comments:
Post a Comment