'ఆర్య-2'కు లీగల్ చిక్కు?

భారీ అంచనాలున్న చిత్రాలకు ఇటీవల కాలంలో శల్య పరీక్షలు తప్పడం లేదు. 'మగధీర' చిత్రంలోని పాట తనదేనంటూ వంగపండు సృష్టంచిన సంచలనం ఆ తర్వాత సద్దుమణిగింది. ఇటీవలే బాలీవుడ్ 'కుర్బాన్' చిత్రంలోని రెండు పాటల్లో సాహిత్యం 'రెచ్చగొట్టే' విధంగా ఉందంటూ ముంబై హైకోర్టులో కేసు పడింది. అయితే దీనిపై దర్శకనిర్మాతలు, సాహిత్య రచయితను కోర్టు వివరణ కోరుతూ సినిమా రిలీజ్ పై మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ శుక్రవారమే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ వంతు వచ్చిందనీ, 'ఆర్య-2' చిత్రంలోని 'రింగారింగా' పాట వివాదంలో చిక్కుకుందనీ సినీ వర్గాల భోగట్టా. ఈ పాట ఇప్పటికే సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తూ ఆడియో చార్ట్స్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. అయితే ఇందులో 'అశ్లీల' సాహిత్యం ఉపయోగించారంటూ కొద్దిరోజులుగా అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.చంద్రబోస్ రాసిన ఈ పాట సాహిత్యంలో 'వేట కత్తి ఒంట్లోకి దోసి - సిగ్గు గుత్తి తెంచారు' అనే పదం తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, 'సిగ్గు గుత్తి' అనే పదం 'సిగ్గుపొర' ను ఉద్దేశించేననీ కొందరు విమర్శిస్తున్నారు. 'లోక్ సత్తా' పార్టీ ఓ అడుగు ముందుకు వేసి చిత్ర దర్శకనిర్మాతలు, మ్యూజిక్ కంపెనీకి లీగల్ నోటీసులు కూడా పంపిందని కూడా అంటున్నారు. అయితే 'ఆర్య-2' నిర్మాతలకు మాత్రం ఆ నోటీసులు ఇంకా అందలేదట. నిజంగానే ఇది లీగల్ ఇష్యూ అవుతుందా? లేదా పబ్లిసిటీ స్టంట్ లో భాగమేనా అనేది ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది

No comments:

Post a Comment