రాజశేఖర్ ప్రేమ కహానీ!

యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ కు జీవితా రాజశేఖర్ ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తుంటారు. గిట్టని వారు ఆయనను 'కొంగుచాటు కృష్ణుడు' అని అన్నప్పటికీ ఆయన లెక్కచేయరు. తొలినాళ్లలో ఇద్దరూ స్క్రీన్ జంటగా నటించినప్పటికీ ఒక ప్రమాదంలో రాజశేఖర్ తీవ్రంగా గాయపడిన తరుణంలో జీవిత చేసిన సపర్యలు ఆయనను సేదతీర్చి మళ్లీ కోలుకునేలా చేశాయి. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వారు పెళ్లి చేసుకోవడం, శివానీ, శివాత్మిక అనే ఇద్దరు ఆడపిల్లలు కలగడం ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే కాలేజీ రోజుల్లోనే రాజశేఖర్ ఓ అమ్మాయిని ప్రేమించారట. ఆ క్రమంలోనే ఆయనలో దైవభక్తి అంకురించిందట. ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి రాజశేఖర్ వివరిస్తూ...
'దేవుడన్నా, గుడిలోకి వెళ్లడం, పూజలు చేయడమన్నా నాకు నమ్మకం ఉండేది కాదు. 1980 వరకూ ఇదే విధంగా జరిగింది. అవి నేను కాలేజీ చదువుతున్న రోజులు. నాకంటే ఐదేళ్లు చిన్నదైన ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమెకు ప్రపోజ్ కూడా చేశాను. ఆమె చిన్నబుచ్చింది. దాంతో డిప్రెషన్. మానసిక ప్రశాంతత కోసం ప్రార్థన చేయమని మిత్రులు సలహా ఇచ్చారు. అప్పుడే తొలిసారి గుడిలోకి అడుగుపెట్టాను. చెన్నైలోని మైలాపూర్ లో ఉన్న శివాలయానికి వెళ్లాను. నువ్వంటూ నిజంగా ఉంటే ఆ అమ్మాయి నా ప్రేమను అంగీకరించేలా చేయాలి అని శివుడ్ని కోరుకున్నాను. ఆశ్చర్యంగా రెండు నెలల తర్వాత ఆమె నా ప్రపోజల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది' అంటూ నవ్వుతూ చెప్పారాయన. ఆ తర్వాత ఏం జరిగిందంటే...ఆ అమ్మాయిని రాజశేఖర్ వివాహం చేసుకోలేదు. అయితే లార్డ్ శివ అంటే ఆయనకు బలమైన నమ్మకం ఏర్పడింది. తన కుమార్తెలిద్దరికీ శివుని పేరు కలిసొచ్చేలా శివానీ, శివాత్మిక అనే పేర్లు పెట్టుకున్నారు. తన 'ఫెయిల్యూర్ లవ్ విత్ ఎ గుడ్ ట్విస్ట్' గురించి ఆయన ఎప్పుడైనా జీవితకు చెప్పారో లేదో మరి..?!

No comments:

Post a Comment