పోసాని టైటిల్ పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'జెంటిల్ మేన్'. వీరభద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నల్లం శ్రీనివాస్ సమర్పణలో నల్లంపద్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం సాయంత్రం సినీ మాక్స్ లో జరిగింది. ఆడియో సీడీని శ్రీకాంత్ ఆవిష్కరించి తొలి ప్రతిని పోసాని కృష్ణమురళికి అందజదేశారు. సాయిరాం శంకర్, ఆకాష్, ఎమ్మెల్యే కన్నబాబు, సి.కల్యాణ్, సముద్ర, కె.వాసు. నల్లం శ్రీనివాస్, చిత్ర సంగీత దర్శకుడు మల్లిక్ శర్మ తదితరులు హాజరయ్యారు. మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఆడియో విడుదలైంది.తొలుత సి.కల్యాణ్ మాట్లాడుతూ, నల్లం శ్రీనివాస్ మంచి ప్లానింగ్ ఉన్న నిర్మాత అనీ, ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి పోసాని కృష్ణమురళి అనీ, ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ కన్నబాబు అన్నారు. దర్శకనిర్మాతలు ఇద్దరూ జెంటిల్ మెన్ లనీ, వారికి మంచి విజయం రావాలని పి.వాసు అభిలషించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ, తన కెరీర్ ప్రారంభం నుంచి పోసాని తనకు తెలుసనీ, ఆపరేషన్ ధుర్యోధనలో తనను కొత్తగా చూపించారనీ అన్నారు. అలాగే నిర్మాతల బాగోగులు కూడా ఆయనకు బాగా తెలుసనీ అన్నారు. ఈ చిత్ర నిర్మాత మంచి ప్లానింగ్ ఉన్నవాడని, జెంటిల్ మెన్ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. పోసాని మాట్లాడుతూ, శీలం గురించి చర్చించే కథాంశమిదనీ, ఈ సినిమా విషయంలో సి.కల్యాణ్ తనకు బాగా సహకరించారనీ అన్నారు. తనకు సంగీతం గురించి తెలియకపోయినా ఒక పాట బాగుందా లేదా అనేది చెప్పగలననీ, ఈ చిత్రానికి మల్లిక్ శర్మ మంచి సంగీతం అందించరానీ అన్నారు. సినిమా చక్కటి విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. సంగీత దర్శకుడుగా అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు మల్లిక్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ సినిమా తీయగలిగినట్టు నిర్మాత నల్లం శ్రీనివాస్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment