కెఆర్ఆర్-మనోజ్ చిత్రం

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చాలా విరామం తర్వాత మళ్లీ ఓ సంగీత భరతి ప్రణయకావ్యాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై శ్రీమతి లక్ష్మీప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ కథానాయకుడు. మోహన్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 12న ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రారంభమైంది. మనోజ్ పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు క్లాప్ ఇవ్వగా, పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ ఆదివారంతో ఒక పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. తొలిసారి ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
మోహన్ బాబు మాట్లాడుతూ, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తాను చేసిన 'అల్లుడుగారు', 'అల్లరి మొగుడు', 'మేజర్ చంద్రకాంత్' అద్భుత విజయాలను సాధించాయనీ, ఇప్పుడు తమ కలయికలో వస్తున్న నాలుగో చిత్రమిదనీ చెప్పారు. 'మేజర్ చంద్రకాంత్' లో బాలనటుడిగా చేసిన మనోజ్ ఈ చిత్రంలో హీరోగా చేస్తుండటం, తొలిసారి లక్ష్మీప్రసన్న పూర్తి స్థాయి నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉందన్నారు. కీరవాణి చాలా చక్కటి పాటలు అందించారనీ, రాఘవేంద్రరావు-కీరవాణి కాంబిషన్ లో వచ్చిన ఎన్నో విజయవంతమైన చిత్రాల పరంపరంలో ఇది కూడా ఉంటుందని అన్నారు. లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ, కథ కోసం ఆరు నెలలు కష్టపడి పక్కా స్క్రిప్టుతో షూటింగ్ మొదలుపెట్టామని చెప్పారు. అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ మాట్లాడుతూ, చెల్లెలు లక్ష్మీప్రసన్న నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉందన్నారు. విష్ణు, మనోజ్, లక్ష్మి ముగ్గురూ తండ్రికి మించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలనటుడిగా చేసిన తాను ఇప్పుడు హీరోగా నటిస్తున్నానంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాననీ, ఎన్నో నేర్చుకోవడానికి ఆస్కారం దొరికిందనీ, తన కెరీర్ కు ఇది చాలా మంచి చిత్రమవుతుందనీ మనోజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, కీరవాణి, ఎస్.గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఐశ్వర్య, ప్రగతి, ధర్మవరపు, ఏవీయస్, తదితరులు నటిస్తున్నారు. భూపతిరాజా మూల కథ అందించిన ఈ చిత్రానికి గోపీమోహన్-రవి బివిఎస్ కథ-స్క్రీన్ ప్లే, శశి రాజసింహ మాటలు, ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు.

No comments:

Post a Comment