యంగ్ వైఎస్ఆర్ గా శ్యామ్

స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఇతివృత్తంలో రుపుదిద్దుకోనున్న 'రాజశేఖర్ రెడ్డి' చిత్రంలో యువ రాజశేఖర్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు శ్యామ్ నటించనున్నారు. ఈ చిత్రాన్ని వైష్ణో అకాడమీ పతాకంపై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. టైటిల్ పాత్రను హీరో రాజశేఖర్ పోషించనున్నారు. వైఎస్ బాల్యం, డాక్టర్ కావడం, రాజకీయాల్లోకి రావడం వంటి అన్ని దశలనూ ఇందులో పూరీ చూపించబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఆయా దశల్లో పలువురి నటుల ఎంపిక జరుగుతోంది. ఇందులో భాగంగానే వైఎస్ యువకుడిగా ఉన్నప్పటి పాత్రను శ్యామ్ పోషించబోతున్నారు
తమిళంలో హీరోగా పేరుతెచ్చుకున్న శ్యామ్ తెలుగులో 'కిక్' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో పోలీసు అధికారిగా ఆయన నటనకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం తమిళంలో 'అగమ్ పురమ్' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. దీనితో పాటు 'రాజశేఖర్ రెడ్డి' చిత్రంలో నటించే అవకాశం పూరీ తనికిచ్చారనీ, వైఎస్ యువకుడిగా ఉన్నప్పుడు మంచి బాడీబిల్డర్ కావడంతో పాటు ఓ దశలో పోలీసు అధికారి కావాలని ప్రయత్నించినట్టు తెలిసిందనీ, ఆ పాత్రకు తాను అయితే బాగుంటుందని భావించి పూరీ ఈ ఆఫర్ ఇచ్చారనీ శ్యామ్ తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి విషయ సేకరణ చేస్తూ స్క్రిప్టు సన్నాహాలు జరుగుతున్నాయి. 2010 ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్స్ పైకి వస్తుంది.

No comments:

Post a Comment