సకుటుంబ సమేతంగా చూసి ఆనందించదగిన చిత్రంగా 'హాసిని' రూపొందుతోందని ఆ చిత్ర దర్శకుడు బి.వి.రమణారెడ్డి తెలిపారు. కమలాకర్ ('అభి' ఫేమ్), సంధ్య ('ప్రేమిస్తే' ఫేమ్) జంటగా కమల్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మంగళవారంనాడు ఆ విశేషాలను చిత్ర యూనిట్ తెలియజేసింది.ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఒక ప్లానింగ్ ప్రకారం ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తవుతోందనీ, ఇంతవరకూ 90 శాతం షూటింగ్ పూర్తయిందనీ రమణారెడ్డి తెలిపారు. బ్యాలెన్స్ ఉన్న 3 పాటల్లో ఒక పాటను ఈ నెల 10 నుంచి ఊటీలోనూ, రెండు పాటలు విదేశాల్లోనూ ప్లాన్ చేసినట్టు చెప్పారు. హాసిని పాత్రలో సంధ్య చక్కటి నటన ప్రదర్శిస్తోందనీ, ఆమె పాత్ర చిలిపిగా, తుంటరిగా, కామెడీగా, లవ్లీగా వివిధ కోణాల్లో ఉంటుందన్నారు. సంధ్యకు జోడిగా కమలాకర్ ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారని చెప్పారు. హీరో-నిర్మాత కమలాకర్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లంతా తామే నిర్మాతలం అనుకుని కమిట్ మెంట్ తో పనిచేస్తున్నారనీ, దర్శకుడు రమణారెడ్డి సైతం ఓ మంచి టర్నింగ్ కోసం కసిగా చేస్తున్న చిత్రమిదనీ అన్నారు. హీరోయిన్ గా తనకు ఈ చిత్రంతో మంచి పేరు వస్తుందని సంధ్య పేర్కొంది. స్టడీకామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ చివర్లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కె.ప్రవీణ్ చంద్ర తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గిరిబాబు, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు, కృష్ణ భగవాన్, ఆలీ, వేణుమాధవ్, పృధ్వీ, హేమ, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు. మరుధూరి రాజా మాటలు, కె.వి.కృష్ణారెడ్డి ఎడిటింగ్, కోటి సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment