శివాజీ కథానాయకుడుగా నటిస్తూ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తొలిసారి నిర్మాతగా మారి రూపొందిస్తున్న చిత్రం 'తాజ్ మహల్'. అరుణ్ సింగరాజు దర్శకుడు. ఈ చిత్రం ఆడియో వేడుక రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం రాత్రి జరిగింది. ఆడియో క్యాసెట్లను డాక్టర్ దాసరి నారాయణరావు ఆవిష్కరించి హీరో శ్రీకాంత్, టీవీ9 రవిప్రకాష్ లకు అందజేశారు. ఆడియో సీడీలను రవిప్రకాష్ ఆవిష్కరించి నటి భూమిక, సంగీత దర్శకుడు అభిమన్ రాయ్ లకు అందజేశారు.దాసరి మాట్లాడుతూ, హీరోలు, దర్శకులు ఒక్కోసారి తమను తాము నిరూపించుకునేందుకు నిర్మాతలుగా సొంత చిత్రాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. శివాజీ మొదట్నించీ కష్టపడే మనస్తత్వం ఉన్నవాడనీ, ఖాళీగా ఉండకూడదని ఎప్పుడూ ఏదో ఒకటి చేసేవాడనీ, నిర్మాతగా కూడా అతను సక్సెస్ కావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ఏ ప్రజలైతే తమను ఇంతవాళ్లను చేసిందో ఆ ప్రజలకు ఏ కష్టం వచ్చినా పరిశ్రమ అదుకుందనీ, వరద బాధితులను ఆదుకునేందుకు పరిశ్రమ ఈనెల 7న తలపెట్టిన స్టార్ నైట్ ను అందరూ విజయవంతం చేయాయలనీ ఆయన కోరారు. వరద బాధితుల కోసం పరిశ్రమ స్పందించిన తీరు తననెంతగానో ముగ్ధుడ్ని చేసిందనీ, ఇది తాను పాల్గొన్న తొలి సినీ ఫంక్షన్ అనీ అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, పదిహేనేళ్ల క్రితం వచ్చిన 'తాజ్ మహల్ ' చిత్రం తన కెరీర్ కు ఎంతో దోహదం చేసిందనీ, అదే తరహాలో శివాజీకి కూడా ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడాలని కోరుకుంటున్నాననీ అన్నారు. గతంలో శివాజీతో కలిసి నటించినప్పుడు అతని మంచితనం, టాలెంట్ తనకు అర్ధమయ్యాయని భూమిక పేర్కొన్నారు. నిరంతర కృషీవలుడు శివాజీ అని డాక్టర్ బ్రహ్మానందం ప్రశంసించారు. నిర్మాతగా స్థిరపడాలని తాను ఈ సినిమా చేయడం లేదనీ, మంచి సక్సెస్ కోసం చేస్తున్న చిత్రమిదనీ శివాజీ అన్నారు. ఈ వేడుకలో అరుణ్ సింగరాజు, ఆలీ, జీవా, ఉత్తేజ్, రామ్ జగన్, సుచిరిండియా కిరణ్, గీత రచయితలు భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, కన్నడ దర్శకుడు చంద్రు, నటి సోనియా తదితరులు పాల్గొన్నారు. ఏవీఎస్ వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
No comments:
Post a Comment