తెలుగు సినిమా సంగీతానికి ఓ కొత్త ట్రెండ్ ను తీసుకువచ్చిన ఆర్.పి.పట్నాయక్ ఆ తర్వాత నటుడుగా, దర్శకుడుగా బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. 'నీకోసం', 'చిత్రం', 'నువ్వు నేను', 'జయం', 'సంతోషం' వంటి చిత్రాలతో సంగీత ప్రియులను ఆయన ఉర్రూతలూగించారు. తమిళ, కన్నడ భాషా చిత్రాల్లోనూ తన సంగీత ప్రతిభను చాటుకున్నారు. 'శీను వాసంతి లక్ష్మి' చిత్రంలో తొలిసారి ఆయన ముఖానికి మేకప్ వేసుకుని అంధుడి పాత్రకు జీవం పోశారు. 'అందమైన మనసులో' అనే ప్రేమకావ్యానికి తొలిసారి దర్శకత్వం వహించి అదే చిత్రానికి ఉత్తమ కథా రచయితగా 2008 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది అవార్డును గెలుచుకున్నారు. ఇప్పుడు ఆర్.పి. ప్రతిభ ఎల్లలు దాటి హాలీవుడ్ కు చేరుకుంది. తొలిసారిగా ఆయన 'యామీ' అనే హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రచారార్భాటాలకు దూరంగా ఈ చిత్రం నిర్మాణం జరుపుకొంటోంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని టి.పి. ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తోందిహారర్ థ్లిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టోఫర్ అట్కిన్స్ ('బ్లూ లాగూన్' ఫేమ్) ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జెస్కికా డిజియోవన్ని, కుర్ట్ పీటర్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమెరికాలోని లాంకెస్టర్ లో ఉన్న యామిష్ విలేజ్ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. వారం రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకుని ఆర్.పి. ఇండియాకు రాగానే ప్రమోషన్ వర్క్ చేపట్టనున్నారు. ఆర్.పి.పట్నాయక్ ఈ చిత్రానికి కంపోజర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
No comments:
Post a Comment