పవన్ 'పులి' ఫిబ్రవరికే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కొత్త చిత్రం ఏదీ విడుదల కాకుండానే ఈ ఏడాది ముగియబోతోంది. కొద్దికాలంగా ఆశించిన సక్సెస్ లభించని పవన్ కు గత ఏడాది ఏప్రిల్ 2న విడుదలైన 'జల్సా' చిత్రం సరైన హిట్ ఇచ్చింది. ఆ చిత్రం తర్వాత ఆయన ఎక్కువ లేటు లేకుండానే 'కొమురం పులి' సెట్స్ మీదకు వచ్చినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఎన్నికల కారణంగా ఆ చిత్ర నిర్మాణం నత్తనడకన సాగుతూ వచ్చింది. ఇటీవలే ఈ చిత్రం నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఎస్.జె.సూర్య ('ఖుషీ' ఫేమ్) దర్శకత్వంలో కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవన్ కు జోడిగా నిఖిషా పటేల్ హీరోయిన్ గా పరిచయమవుతోంది
ఈ చిత్రం ప్రోగ్రస్ ను ఎస్.జె.సూర్య తెలియజేస్తూ, పవన్ తో తన దర్శకత్వంలో వచ్చిన 'ఖుషీ' కంటే ఇది చాలా పెద్ద హిట్ అవుతుందనీ, పవన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పారు. పవన్ ను కొత్తకోణంలో ఆవిష్కరిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గదనీ తలిపారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం సినిమాకి వెన్నుదన్నుగా నిలుస్తుందనీ, సాంకేతిక అంశాలన్నీ ప్రధాన హైలైట్స్ అవుతాయనీ చెప్పారు. బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేసి జనవరిలో ఆడియో, ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మనోజ్ బాజ్ పేయి, గిరీష్ కర్నాడ్, చరణ్ రాజ్, నాజర్, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, ఆలీ, కోవై సరళ, హనీఫా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ఆనంద్ సాయి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

No comments:

Post a Comment