ఇద్దరి భామల మధ్య నలిగిపోయే హీరోగా శ్రీకాంత్ నటించిన చిత్రం 'అ ఆ ఇ ఈ'. అతను ఆమె, ఇంతలో ఈమె ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. శ్రీకాంత్ సరసన మీరాజాస్మిన్, సదా హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. శ్రీ కల్పన ఆర్ట్స్ పతాకంపై బొద్దం అశోక్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 6న విడుదలవుతోంది. హైద్రాబాద్ లోని ఫిలించాంబర్ లో మంగళవారంనాడు ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.ఫ్యామిలీ, సెంటిమెంట్, వినోదం అంశాల సమ్మేళనంతో ఈ చిత్రాన్ని మలిచామనీ, నిర్మాణపరంగా, సాంకేతకపరంగా కూడా సినిమా చాలా బాగా వచ్చిందనీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 'మహాత్మ' చిత్రంలో మాస్ పాత్రను పోషించిన శ్రీకాంత్ ఇందులో ఇరువరు భామల మధ్య సతమతమయ్యే పాత్రలో నటించారని అన్నారు. మీరాజాస్మిన్ పాత్రకు అవార్డు వస్తుందని రీరికార్డింగ్ సమయంలో సంగీత దర్శకురాలు శ్రీలేఖ చెప్పారనీ, అలాగే సదాకు ఈ చిత్రంతో మళ్లీ మంచి బ్రేక్ వస్తుందనీ అన్నారు. తన గత చిత్రాల కంటే మరింత హాస్యభరితంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. కథ సినిమాకి ఆయువుపట్టనీ, పాత్రలకు సరిపోయే నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం తీశామనీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేఖర్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, కృష్ణభగవాన్, రఘుబాబు, కవిత తదితరులు నటించారు.
No comments:
Post a Comment