డిసెంబర్ 4న 'ప్రవరాఖ్యుడు'

ప్రవరాఖ్యుడు అనగానే...ఆడవాళ్లకు ఆమడదూరంలో ఉండేవాళ్లుగా చెబుతుంటాం. తనకు తెలియకుండానే అమ్మాయిలను ఆకర్షించే కొత్తరకం 'ప్రవరాఖ్యుడు' ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జగపతిబాబు, ప్రియమణి జంటగా మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ప్రవరాఖ్యుడు' చిత్రంలోని మెయిన్ పాయింట్ ఇదే. 'పెళ్లయిన కొత్తలో' చిత్రం తర్వాత జగపతిబాబు, ప్రియమణి, మదన్ కలిసి పనిచేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టాలీ 2 హాలీ ఫిలిమ్స్ పతాకంపై గణేష్ ఇందుకూరి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.జగపతిబాబు మాట్లాడుతూ, మదన్ సినిమా అంటే డిఫరెంట్ గా తీస్తారనే ఫీలింగ్ ఇటు పరిశ్రమలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ ఉందనీ, అందుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మదన్ ఎంతో కలర్ ఫుల్ గా తీశారనీ చెప్పారు. విద్యార్థి దశలో మొదలైన ప్రేమ...పరిణతి చెందిన లెక్చరర్ గా ఎదిగాక ఎలా మారిందనేది ఇందులో ఆసక్తికరంగా మదన్ తెరకెక్కించారనీ చెప్పారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రియమణికి ఈ చిత్రం మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందనీ, కీరవాణి సంగీతం మరో హైలైట్ అవుతుందనీ ఆయన చెప్పారు. పరిణతి చెందిన ప్రేమజంట కథతో ప్రేమలోనే భావోద్వేగాలను చాటిచెప్పే విధంగా ఈ చిత్రం ఉంటుందని మదన్ తెలిపారు. జగపతిబాబు, ప్రియమణి జంట కన్నులపండువగా ఉంటుందనీ, మంచి సాంకేతిక విలువలున్న చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందనీ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో హంసానదిని, డాక్టర్ బ్రహ్మానందం, ఆలీ, సునీల్, ధర్మవరపు, చలపతిరావు, సివిఎల్, రాజ్యలక్ష్మి, మధుశర్మ, అనితానాథ్ తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం మదన్ అందిస్తున్న ఈ చిత్రానికి చైతన్యప్రసాద్ పాటలు, సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎంఆర్ వర్మ ఎడిటింగ్ అందించారు.

No comments:

Post a Comment