వైభవ్-శ్వేత 'కాసుకో' 27న

'గొడవ' చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టిన వైభవ్ కథానాయకుడుగా జి.నాగేశ్వరరెడ్డి ('సీమశాస్త్రి' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'కాసుకో'. కె.ఫిలిమ్స్ బ్యానర్ పై ఎ.కోదండరామిరెడ్డి సమర్పణలో ఎ.భారతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైభవ్ కు జోడిగా అందాల నటి శ్వేతబసు ప్రసాద్ నటిస్తోంది. ఈనెల 27న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
లవ్, యాక్షన్ వంటి అంశాలు మేళవించి దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారీ, వైభవ్ లోని ఫైర్ ను తెలిపే సినిమా ఇదనీ కోదండరామిరెడ్డి తెలిపారు. హీరోకీ, ప్రతినాయకులకూ మధ్య సాగే సమరం రసవత్తరంగా ఉంటుందనీ, ఏ సందర్భంలో హీరో కాసుకో అనాల్సి వస్తుందనేది ఆసక్తికరంగా ఉంటుందనీ చెప్పారు. రామాయణ గాధను ప్రేరణగా తీసుకుని కథ తయారు చేసినట్టు చెప్పారు. హైద్రాబాద్, వైజాగ్ లలో షూటింగ్ జరిపామనీ, శ్వేతబసు ప్రసాద్ గ్లామర్ తో కూడిన నటన ప్రదర్శించగా, మరో పాత్రలో గౌరీ పండిట్ నటించిందని అన్నారు. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఇందులో తన స్టైల్ లో ఉండే హాస్యంతో పాటు మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉన్నాయని అన్నారు. వైభవ్ ను కొత్త కోణంలో ఆవిష్కరించామనీ, అతని నటన హైలైట్ గా నిలుస్తుందనీ చెప్పారు. వైభవ్-శ్వేతబసు జంట కన్నులపండువగా ఉంటుందన్నారు. యూత్ ను ఆకట్టుకునే మ్యూజిక్ మరో హైలైట్ అన్నారు. ఈనెల 18న ఆడియో, 27న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, సలీమ్, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, అజాద్ తదితరులు నటించారు. గోలీమోహన్ స్క్రీన్ ప్లే, రవి సంభాషణలు, ప్రేమ్ జీ సంగీతం అందించారు

No comments:

Post a Comment