దగ్గుబాటి రానా తొలి సినిమా 'లీడర్' ఇంకా రిలీజ్ కాకుండానే బాలీవుడ్ ప్రముఖుల చూపు ఆయనపై పడింది. గోవాలోని డ్రగ్ మాఫియా కథాంశంతో రూపొందనున్న ఓ హిందీ చిత్రంలో ఆయన అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. అభిషేక్ బచ్చన్ పాత్రకు ఏమాత్రం తగ్గకుండా రానా పాత్ర ఉంటుందని తెలుస్తోంది. దర్శకనిర్మాత రోహన్ సిప్పీ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.రోహన్ సిప్పీ ఇటీవల 'లీడర్' చిత్రం ప్రివ్యూ చూసి రానా నటనకు ముగ్దుడయ్యారనీ, మరో ఆలోచనకు తావులేకుండా సెకెండ్ లీడ్ కు ఆయన చేత అగ్రిమెంట్ చేయించారనీ తెలిసింది. దగ్గుబాటి రామనాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు అయిన రానా ఇప్పటికే 'ఎ బెల్లీఫుల్ ఆఫ్ డ్రీమ్స్' చిత్రం ద్వారా నిర్మాతగా కూడా మంచిపేరు తెచ్చుకున్నారు. తొలిసారి 'లీడర్' చిత్రం ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏవిఎం బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గతంలో డి.రామానాయుడు సైతం హిందీలో 'ప్రేమ్ నగర్', 'తోఫా' వంటి హిందీ చిత్రాలు నిర్మించగా, రానా అంకుల్ వెంకటేష్ సైతం 'అనారి' (చంటి) చిత్రంలో నటించారు. ఇప్పుడు బాలీవుడ్ లో రానా వంతు వచ్చింది. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి దక్షిణాది హీరోలు హిందీలో నటించినా ఎక్కువగా సొంత భాషా చిత్రాలపైనే దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో రానా బాలీవుడ్ ఎంట్రీ ఆయనను సక్సెస్ ఫుల్ హీరోగా నిలుపుతుందేమో చూడాలి.
No comments:
Post a Comment