తెలంగాణ ఉద్యమకారుల ఆందోళనలో భాగంగా షూటింగ్ లకు అంతరాయం కలిగిన చిత్రాల్లో అల్లు అర్జున్ నటిస్తున్న 'వరుడు' చిత్రం కూడా ఒకటి. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల దాడి జరగడంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగినట్టు కనిపిస్తుండటంతో తిరిగి హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుతున్నారు. కొద్దిపాటి టాకీ, పాటలు మినహా షూటింగ్ దాదాపు పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.అల్లు అర్జున్ తో 'దేశముదురు' వంటి హిట్ చిత్రం తర్వాత నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా పతాకంపై అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ కు జోడిగా ఒక కొత్తమ్మాయిని పరిచయం చేస్తుండగా, తమిళ హీరో ఆర్య ఇందులో విలన్ గా నటిస్తున్నారు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవితంలోని వంద కుంటాబాలు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ చిత్రంలో నటించడం విశేషం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలోని అన్ని పాటలు వేటూరి సుందర రామమూర్తి రాశారు. సమ్మర్ కానుకగా మార్తి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ లతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో కనిపించనున్నారు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, అశోక్ ఆర్ట్, ఆంధోని ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment