మీరాచోప్రా గుడ్ బై...

ఏ రంగంలోనైనా సక్సెస్ అనేదే కీలకం. ముఖ్యంగా సినీ రంగంలో సక్సెస్ లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు. ఎంత కష్టపడి నటించినా కూసింత అదృష్టం కూడా తోడవ్వాలి. నటి మీరాచోప్రా విషయంలో అదృష్టం ముఖం చాటేసి చాలా కాలమే అయింది. నితిన్ తో కలిసి మీరా చోప్రా నటించిన తొలిచిత్రం 'సత్యం శివం సుందరం' ఈ రోజు వరకూ విడుదలకు నోచుకేలేదు. పారితోషికం విషయంలో మీరాచోప్రా కోర్టుకు ఎక్కడంతో రెండేళ్ల క్రితం ఆ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కు జోడిగా మీరా నటించిన 'బంగారం' సైతం ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోయింది. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తొలిసారిగా దర్శకత్వం వహించిన 'వాన' చిత్రం మీరాను తీవ్రంగా నిరాశపరచింది. దీంతో మీరాకు తెలుగులో అవకాశాలు ఇచ్చే వాళ్లు కరువయ్యారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న'జగన్మోహిని' చిత్రం మాత్రమే మీరా చేతుల్లో ఉంది. అయితే టైటిల్ పాత్ర నమిత పోషిస్తుండటంతో ఏమాత్రం సినిమాకి క్రెడిట్ వచ్చినా అది నమిత ఖాతాలోకే వెళ్లిపోతుంది. గోళ్లు గిల్లుకుని కూర్చుంటే లాభం లేదనుకుందే ఏమో కానీ ఇటీవల ఓ సెక్సీ ఫోటో షూట్ లో కూడా మీరా పాల్గొంది. అయినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో విసిగిపోయి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటోంది. ఇందుకు ప్రతిగా వ్యాపారరంగంలోకి అడుగుపెడుతుందట.'సినిమాలకు ఇకెంత మాత్రం నేను సరిపడనని అనిపిస్తోంది. ఎక్కడ్నించి వచ్చానో అక్కడికే వెళ్లిపోదామని అనుకుంటున్నాను. నాన్నగారి బిజినెస్ లోకి అడుగుపెట్టి వ్యాపారాన్ని డవలప్ చేయాలనుకుంటున్నాను. జగన్మోహిని చిత్రమే బహుశా నా చివరి సినిమా కావచ్చు' అని మీరా ఓ ప్రముఖ వార్తాపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. మీరాచోప్రా తండ్రికి లండన్ లో పలు హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ హోటల్ బిజినెస్ ను ఇండియాలో కూడా విస్తరించాలనే ఆలోచనలో మీరా ఉంది. ఒకసారి గ్లామర్ వరల్డ్ లోకి వచ్చిన వాళ్లు వెనక్కి వెళ్లాలంటే కష్టమే అయినా మీరా పట్టుదల చూస్తుంటే ఆమెకు వ్యాపారంరంగమే కలిసొచ్చేలా ఉంది...

No comments:

Post a Comment