అల్లరి నరేష్ జాక్ పాట్!

ఏడాదిలో అత్యధిక సినిమాలు చేస్తూ రాజేంద్రప్రసాద్, నరేష్ ల తర్వాత కామెడీ కింగ్ తానేనని నిరూపించుకున్నట్టు అల్లరి నరేష్ మళ్లీ సైలెంట్ హిట్ కొట్టారు. నంది అవార్డు కూడా తన ఖాతాలో వేసేసుకున్నారు. వరుస ఆఫర్లు కూడా క్యూలో ఉన్నాయి. 'మగధీర' తర్వాత ఇండస్ట్రీలో సరైన హిట్ రాలేదని అంతా అనుకుంటున్న తరుణంలో అల్లరి నరేష్ నటించిన 'బెండు అప్పారావు ఆర్ఎంపి' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ప్రేక్షకాదరణ చూరగొంటోంది. ఇప్పటికే హిట్ టాక్ ను కూడా సొంతం చేసుకుని గట్టి కలెక్షన్లు కూడా దక్కించుకుంటోంది. మరో 20 ప్రింట్లు పెంచేందుకు నిర్మాత రామానాయుడు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఇదే తరుణంలో 'గమ్యం' చిత్రానికి ఉత్తమ సహాయనటుడుగా నంది అవార్డు సైతం అల్లరి నరేష్ ను వరించడంతో ఆయన సంబరంలో ఉన్నారు. తాజాగా మరికొన్ని అవకాశాలు కూడా అల్లరి నరేష్ కోసం ఎదురుచూస్తున్నాయి.

తమిళ 'నానోడిగళ్' చిత్రానికి రీమేక్ గా తెలుగులో రూపొందుతున్న 'శంభో శివ శంభో' చిత్రంలో హీరో రవితేజతో కలిసి అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్నారు. కళాతపస్వి కె.విశ్వానాథ్ దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకత్వం వహించేందకు సిద్ధంగా ఉన్న చిత్రంలోనూ అనూహ్యంగా అల్లరి నరేష్ కు హీరోగా ఆఫర్ వచ్చింది. వీటికి తోడు నిర్మాత సుంకర రామబ్రహ్మం సైతం అల్లరి నరేష్ తో ఓ కొత్త చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్, షీన జంటగా 'బిందాస్' చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ తో ఆయన ప్లాన్ చేస్తున్న చిత్రం ద్వారా చౌదరి అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారు. ఈనెలలోనే ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

No comments:

Post a Comment