'కీచక' నుంచి నయన ఔట్!

తమిళ 'బిల్లా' చిత్రంలో బికినీ ధరించి నయనతార సృష్టించిన సంచలనం తంబీలు ఇప్పటికీ మరిచిపోయి ఉంటారు. అయితే ఏ పనైనా మొదటిసారి చేసినప్పుడే సంచలనం అంటారనీ, రెండోసారి చేయడం ససేమిరా కుదరదని నయనతార కుండబద్ధలు కొట్టినట్టు చెప్పడంతో అప్పట్లో తెలుగులో ప్రభాస్ నటించిన 'బిల్లా' చిత్రం ఆమె చేజారిపోయింది. ఆ ఆఫర్ అనుష్క చేతికి వచ్చింది. తాజాగా మరోసారి నయనతార చేసిన 'బికినీ బెట్టు'తో ఓ కన్నడ ప్రాజెక్ట్ ఆమె చేతినుంచి జారిపోయినట్టు సమాచారం.

కన్నడ సీనియర్ హీరో రవిచంద్రన్ తో 'కీచక' చిత్రంలో నటించేందుకు నయనతార కొద్దిరోజుల క్రితం అంగీకరించింది. గత ఆదివారం బెంగుళూరులో ఈ చిత్రం ప్రారంభోత్సవానికి నయనతార హాజరు కావలసి ఉంది కూడా. నయనతార పాత్ర గురించి రవిచంద్రన్ ఫోనులో చెప్పారనీ, ఆమె సైతం ఆ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపించిందనీ నిర్మాత మునిరత్నం సైతం చెప్పుకొచ్చారు. అనూహ్యంగా ఇప్పుడు నయనతార ప్లేస్ లో మరో హీరోయిన్ కోసం ఆయన అన్వేషిస్తున్నారని సమాచారం. అందాల ప్రదర్శనకు కానీ, బికినీ ధరించేందుకు కానీ నయనతార సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమట. 'సినిమా సబ్జెక్ట్ కు ఆమె సరిపోదనుకుంటే ఆ పాత్రకు సరిపోయే మరొకరికి ఎంపిక చేయమని దర్శకుడు సూచించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం' అని మునిరత్న చెప్పినట్టు సినీ వర్గాల భోగట్టా. నయనతార నిర్ణయం వెనుక బికినీ వ్యవహారమే కారణమా, ఆమె మానసచోరుడు ప్రభుదేవా ఏదైనా రూలింగ్ ఇచ్చి ఉంటారా అనేది పలువురిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

No comments:

Post a Comment