రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తి 200 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయాయి. 4 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వేలాది పంట పొలాలు నీటమునిగిపోయాయి. వరద నష్టం 12,225 కోట్ల మేరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. నిన్నటి వరకు కరవు, ఇప్పుడు జలప్రళయం తోడై జాతీయ విపత్తును తలపిస్తూ హృదయ విదాకరమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఎప్పుడు ఏ విపత్తి వచ్చినా ముందుండే చిత్ర పరిశ్రమ ఈసారి సైతం బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి భారీ విరాళాలు అందజేస్తూ, ఆహార, సహాయ సామాగ్రితో బాధితులను ఆదుకుంటోంది.యువ హీరో రామ్ చరణ్ తొలుత వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. అల్లు అర్జున్ 5 లక్షల రూపాయలు విరాళాన్ని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి అందజేశారు. యువహీరో ఎన్టీఆర్ 20 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి స్వయంగా అందజేశారు. డాక్టర్ డి.రామానాయుడు 10 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి అందజేశారు. తమిళ హీరో సూర్య 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. డాక్టర్ రాజశేఖర్, శ్రీమతి జీవిత దంపతులు స్వయంగా బాధితులను ఆదుకునేందుకు అవసరమైన సహాయ సామాగ్రి, ఆహారంతో బాధిత ప్రాంతాలకు వెళ్లి నేరుగా అందిస్తున్నారు. మెడికల్ టీమ్ ను కూడా త్వరలోనే బాధిత ప్రాంతాలకు పంపనున్నారు. పద్మశ్రీ బ్రహ్మానందం రెండు వ్యానుల్లో బ్రెడ్ లు, నీళ్ల ప్యాకెట్లు, దుప్పట్లు, టవల్స్ వంటి నిత్యావసర వస్తువులను కొందరు యువకల బృందంతో వరద బాధిత ప్రాంతాలకు పంపించారు. వరద ప్రాంతాల్లో సోదరులంతా ఇబ్బందుల్లో ఉన్నారనీ, ప్రతి ఒక్కరూ ఉదారంగా ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని పలువురు సినీ ప్రముఖులు పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment