'స్టార్ నైట్'కు రజనీ, కమల్

రాష్ట్రాన్ని అతలాకుతులం చేసిన వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు నవంబర్ 7న తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్వహించ తలబెట్టిన 'స్టార్ నైట్' కార్యక్రమంలో తెలుగు సినీ ప్రముఖులతో పాటు తమిళ, హిందీ ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న కమల్ హాసన్ సైతం హాజరుకావడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది.

'స్టార్ నైట్' ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్న తరుణంలో నిర్వాహకులు ఈ విశేషాలను తెలియజేసారు. కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ దాసరి నారాయణరావు ఆ విశేషాలను తెలియజేస్తూ, స్టార్ నైట్ నిర్వహణకు పరిశ్రమలోని అన్ని శాఖలను సమన్వయ పరిచి 17 కమిటీలు వేశామనీ, తెలుగు పరిశ్రమకు చెందిన హీరోలందరూ ఇందులో పాల్గొంటారని చెప్పారు. అలాగే 22 మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు అంతా పాల్గొంటారని అన్నారు. తమిళ రంగానికి చెందిన రజనీ, శరత్ కుమార్, విజయ్, సూర్య కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని చెప్పారు. కమల్ హాసన్ సైతం విదేశాల్లో ఉన్నందున ఏమాత్రం వీలున్నా వస్తానని చెప్పారనీ, అమితాబ్ కూడా వచ్చే అవకాశాలున్నాయనీ అన్నారు. హిందీ నటులు జితేంద్ర, వినోద్ ఖన్నా కూడా హాజరవుతారని చెప్పారు. స్టార్ నైట్ టిక్కెట్ల వెల తదితర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని కమిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు.

No comments:

Post a Comment