బంపర్ ఆఫర్' సక్సెస్ మీట్

సాయిరాం శంకర్, బిందు మాధవి జంటగా జయ రవీంద్ర దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్ నిర్మించిన 'బంపర్ ఆఫర్' చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి మంచి రిపోర్ట్ వచ్చిందనీ, విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. వైష్ణవి ఆర్ట్స్ కార్యాలయంలో చిత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. పూరీ జగన్, సాయిరాం శంకర్, జయరవీంద్ర, సంగీత దర్శకుడు రఘుకుంచె పాల్గొన్నారు.

పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, సినిమా ప్రారంభం రోజునే మంచి ఓపినింగ్స్ తో పది వారాల టాక్ వచ్చిందని చెప్పారు. సాయిరాం శంకర్ గత సినిమాలతో పోల్చుకుంటే ఇందులో నటన, డాన్స్ లలో మంచి పరిణితి కనిపించిందనీ, రఘ కుంచె సంగీతం సినిమాకి ప్లస్ అయిందనీ అన్నారు. అలాగే ఆలీ-వేణుమాధవ్ లపై చేసిన 'మగధీర' కామెడీ ట్రాక్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. తొలి సినిమా అయినా దర్శకుడు చాలా బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. సాయిరాం శంకర్ మాట్లాడుతూ, గతంలో తాను నటించిన రెండు చిత్రాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారనీ, వారందరికీ తన కృతజ్ఞతలనీ అన్నారు. దర్శకుడిగా తనకు ఇంత మంచి అవకాశమిచ్చిన పూరీ జగన్నాథ్ కు తన కృతజ్ఞతలని జయరవీంద్ర పేర్కొన్నారు. రఘ కుంచె మాట్లాడుతూ, ఈ చిత్రం తన కెరీర్ కు ఓ బంపర్ ఆఫర్ అనీ, ఇందులోని 'రవణమ్మా..' పాటకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోందనీ, అలాగే పూరీ జగన్నాథ్ పేరు ఈ చిత్రానికి ప్లస్ అయిందనీ అన్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


No comments:

Post a Comment