'సౌత్' స్టైలిష్ హీరో ఎన్టీఆర్

అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ సిఇవోగా వెలువడుతున్న'సౌత్ స్కోప్' ఆంగ్ల సినీ మాస పత్రిక తరపున 2007-2008 సంవత్సరానికి గాను తొలి 'సౌత్ స్కోప్ స్టైల్' అవార్డుల ప్రదానం హైద్రాబాద్ లోని నోవాటెల్ లో ఆదివారం సాయంత్రం కన్నులపండువగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన నటీనుటుల, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ నాలుగు భాషల్లో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని ఆవార్డులు బహూకరించారు. టివి-9 స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్పి అధినేత చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. వెంకటేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, తరుణ్, ఆర్య, భరత్, ధనుష్, విమాలారామన్, శ్రద్ధాదాస్, గౌరీ ముంజల్, ముమైత్ ఖాన్, వి.వి.వినాయక్, క్రిష్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలుగులో స్టైలిష్ హీరో అవార్డును ఎన్టీఆర్ అందుకున్నారు. 'కంత్రీ' చిత్రంలో న్యూ లుక్ తో అలరించినందుకు గాను ఎన్టీఆర్ ఈ అవార్డును ప్రభుదేవా దంపతుల చేతుల మీదుగా అందుకున్నారు. తెలుగులో స్టైలిష్ హీరోయిన్ గా ఇలియానా (జల్సా) ప్రభుదేవా దంపతుల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుంది. తమిళ స్టైలిష్ హీరో అవార్డును ధనుష్ (పొల్లధావన్), స్టైలిష్ హీరోయిన్ అవార్డును శ్రేయ (శివాజీ) అందుకున్నారు. కన్నడ స్టైలిష్ హీరోగా పునీత్ రాజ్ కుమార్ కు అవార్డు అందజేశారు. మలయాళంలో స్టైలిష్ హీరోగా మమ్ముట్టి ఎంపికయ్యారు. ఆయన తరఫున లక్ష్మీరాయ్ ఈ అవార్డును మహమ్మద్ అజారుద్దీన్ చేతుల మీదుగా అందుకున్నారు. 'సౌత్ స్కోప్ యూత్ స్టైల్ ఐకాన్' అవార్డును సూర్య కు ప్రకటించారు. ఆయన తరఫున ధనుష్ హీరో వెంకటేష్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 'సౌత్ స్కోప్ యూత్ స్టైల్ ఐకాన్' ఫిమేల్ అవార్డు నయనతారను వరించింది. తెలుగులో స్టైలిష్ ఫిల్మ్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అతిథి' ఎంపికైంది. మాధవన్-విమాలారామన్ చేతులమీదుగా శ్యామ్ ఈ అవార్డును అందుకున్నారు. తమిళంలో విష్ణువర్దన్ 'బిల్లా'కు అవార్డు లభించింది. కన్నడంలో యోగిరాజ్ భట్ దర్శకత్వం వహించిన 'గజ', మలయాళంలో జోషి దర్శకత్వం వహించిన 20:20 స్టైలిష్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకున్నాయి. వినోద్ సహాని, శియ చేతుల మీదుగా ఈ అవార్డులు అందించారు

No comments:

Post a Comment