నంది అవార్డుల ప్రదానం అంటే తెలుగు సినీ పరిశ్రమకు ఓ పండుగే. ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులు ఆర్టిస్టులలో మరింత ఉత్సాహాన్ని, కమిట్ మెంట్ ను పెంచుతుంటాయి. 2008 నంది అవార్డులను శనివారంనాడు ప్రకటించారు. నంది విజేతల స్పందన వారి మాటల్లోనే...ఉత్తమ నటుడు రవితేజ:
ఈ ఏడాది ఉత్తమ నటుడిగా 'నేనింతే' చిత్రానికి నంది అవార్డు రావడం చెప్పలేనంత సంబరాన్ని కలిగించింది. ఈ రోజు నేను ఇలా ఉండటానికి కారణం దర్శకులు పూరీ జగన్నాథే. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'నేనింతే' చిత్రం విడుదలైన తర్వాత చాలా బాగుందంటూ పలువురు ప్రశంసించారు. పూరీ జగన్ నా మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రంలో నటింపజేశారు. ఆయనకు నా ధన్యవాదాలు.ఈ అవార్డు క్రెడిట్ కూడా ఆయనకే దక్కుతుంది.
పూరీ జగన్నాథ్
నేను తీసిన 'నేనింతే' చిత్రానికి రవితేజకు ఉత్తమనటుడుగా ఎంపిక కావడంతో ఆ అవార్డు నాకే వచ్చినంత ఆనందంగా, సంబరంగా ఉంది. ఇదే చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా కూడా నాకు అవార్డు రావడం ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో 'సంపాదించడం చేతకాని వెధవలకు ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు' అనే డైలాగ్ నాకు చాలా ఇష్టం. అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకూ, అలాగే ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదాలు.
నిర్మాత డివివి దానయ్య
మా బ్యానర్ లో వచ్చిన 'నేనింతే' చిత్రానికి రవితేజ ఉత్తమ నటుడుగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ సంభాషణల రచయితగా నంది అవార్డులకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే చిత్రానికి ఉత్తమ స్టంట్ మాస్టర్లుగా రామ్-లక్ష్మణ్ లకు కూడా అవార్డు వచ్చింది.
ముచ్చటగా 3 నందులు నడిచి రావడం నిర్మాతగా నాకు చాలా చాలా హ్యాపీ.
జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్)
'గమ్యం' చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు, నాకు ఉత్తమ దర్శకుడు అవార్డు రావడం ఎంతో సంతోషం కలిగించింది. చిన్న సినిమాకు పెద్ద పీట వేశారు. ఈ చిత్రాన్ని నాన్నగారు నిర్మించారు. నేను తొలిసారి దర్శకత్వం వహించాను. ఉత్తమ చిత్రం అవార్డు వచ్చిందంటే అన్ని విభాగాలకూ అవార్డులు వచ్చినట్టే. ఈ అవార్డు నాపై మరింత బాధ్యతను పెచింది. ఇది ఒకలాగా మంచి సినిమాలు తీయాలనే హెచ్చరిక లాంటిది కూడా.
'వినాయకుడు' నిర్మాత పట్రా
గతంలో 'ఆ నలుగురు' సినిమా తీశాం. దానికి అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు కూడా వచ్చాయి. 'వినాయకుడు' చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించారు. ప్రభుత్వం మెచ్చి ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ప్రేక్షకులు, అవార్డుల కమిటీ మరోసారి నిరూపించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న 'విధేయుడు' చిత్రం కూడా సందేశంతో పాటు ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా ఉంటుంది. దీనికి కూడా అవార్డులు, రివార్డులు ఆశిస్తున్నాం
No comments:
Post a Comment