సినిమా కథలకు కొరత ఉందనే అభిప్రాయం ఎవరిలోనైనా ఉంటే అది బుర్రలోంచి తుడిచివేయొచ్చు. క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకుంటున్న పూరీ జగన్నాథ్ వద్ద బోల్డన్ని ప్లాట్ లు ఉన్నాయి. హీరో అంటే ఓ అదర్శ పురుషుడు గానో, హీమాన్ గానో చూపించాల్సిన పనిలేదు. హీరోని కావాల్సినంత అల్లరి చిల్లరిగా చూపించి చివర్లో ఓ చిన్ని ట్విస్ట్ పడేస్తే సరిపోతుంది. అసలు హీరోయిజాన్ని రివర్స్ చేస్తే ఓ కొత్త ప్లాట్ కాదూ? పూరీ జగన్నాథ్ కు వచ్చిన అలాంటి తాజా ఆలోచనకు వెండితెర రూపమే 'బంపర్ ఆఫర్'. ఆయన కథతో పాటు సంభాషణలు, నిర్మాణం వంటి కీలక బాధ్యతలను తీసుకుని దర్శకత్వ బాధ్యతలను మాత్రం జయ రవీంద్రకు అప్పగించారు. పేరుకు జయ రవీంద్ర దర్శకుడే అయినా ముద్ర మాత్రం పూరీదే. ఇందులోని 'రివర్స్ హీరోయిజం' బహుశా ఇంతవరకూ ప్రేక్షక జనం చూసి ఉండరు. నలుగురూ నడిచే రూట్ లో నడిస్తే క్రియేటివీ ఎందుకవుతుంది? అదే పూరీ స్టయిల్. పిల్లనిచ్చే తండ్రి తన అల్లుడు తనలాగా రిచ్ మన్ కావాలని కోరుకుంటే (కొద్దిపాటి ఆఫర్ ఇచ్చి), ఆ కుర్రాడు మాత్రం మామనే పాపర్ చేస్తానంటూ రివర్స్ లో 'బంపర్ ఆఫర్' ఇస్తాడు. ఏ మాత్రం సినీ పరిజ్ఞానం ఉన్నా చిరంజీవి 'ఛాలెంజ్' సినిమా ప్లాట్ కు ఇది రివర్స్ అని గ్రహించేయొచ్చు. పూరీ బ్యానర్ నుంచి ఈ సినిమా రావడం, ఇప్పటికే 'రావణమ్మా..'పాట సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తూ ఛార్ట్ బస్టర్ గా నిలవడం సహజంగా ప్రేక్షకులల్లో ఈ చిత్రంపై క్యూరియాసిటీని పెంచింది. మరి 'బంపర్ ఆఫర్' పేరిట ప్రేక్షకులకు పూరీ అండ్ కో ఎలాంటి ఆఫర్లు ఇచ్చారో చూద్దాం...సాయి (సాయిరాం శంకర్) ఓ మోటార్ మెకానిక్. అతని తండ్రి (చంద్రమోహన్) సాధారణ గుమాస్తా. కోటీశ్వరుడైన కన్ స్ట్రక్షన్ కంపెనీ యజమాని సూర్యప్రకాష్ (సాయాజీ షిండే) దగ్గర పనిచేస్తుంటాడు. సూర్యప్రకాష్ తో పాటు అతని భార్య ఉమాదేవి (రక్ష), కూతురు ఐశ్వర్య (బందు మాధవి)కి డబ్బు మదం జాస్తి. పేదరికం, పేదవాళ్ల పొడ అస్సలు గిట్టదు. ఐశ్వర్య ఒకరోజు తన వెంటపడుతున్న ఓ వ్యక్తిని చితగ్గొట్టమని ఓ గ్యాంగ్ ను పంపుతుంది. ఆ గ్యాంగ్ పొరపాటును సాయిని చితగ్గొట్టేస్తారు. సాయి కోలుకున్న తర్వాత ఐశ్వర్యను నిలదీసి ఆమె తలపొగరు చూసి చెంప పగలగొడతాడు. అలా వైరంతో మొదలైన వారి పరిచయం కొన్ని సంఘటనల తర్వాత ప్రేమగా మారుతుంది. ఇది చూసిన సూర్యప్రకాష్ భగ్గుమంటాడు. డబ్బులో పుట్టి పెరిగిన ఐశ్వర్యను ఓ పేదవాడికి ఇచ్చి చేయడం ససేమిరా కుదరదంటాడు. చివరకు పంతాలు పెరిగిపోవడంతో సూర్యప్రకాష్ తన బెట్టు తగ్గించి...తనంత డబ్బు సంపాదించకపోయినా, తన సంపాదనలో సగం సంపాదించి చూపిస్తే తన కూతుర్ని ఇచ్చి చేస్తానని సాయికి ఓ 'ఆఫర్' ఇస్తాడు. నువ్వు ఆఫర్ ఇస్తే నేను కష్టపడి డబ్బులు సంపాదించాల్సిన పని లేదు...నేనే నీకు 'బంపర్ ఆఫర్' ఇస్తున్నాను. నీ సర్వ సంపదలు హరించుకుపోయేలా చేసి ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్ల మీదకు తీసుకువస్తాను. అప్పుడు అంతరాల సమస్య ఉండదు కాబట్టి నీ కూతురికి మొగుణ్ణవుతాను...అంటూ సాయి ప్రతి సవాల్ విసురుతాడు. సాయి తన ప్రయత్నంలో ఎలా సక్సెస్సయ్యాడనేది మిగతా కథ.
No comments:
Post a Comment