ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ సి.ఇ.వో.గా దక్షిణాది మ్యాగజైన్ 'సౌత్ స్కోప్' సినీ అభిమానుల ముందుకు వచ్చింది. ఈ మ్యాగజైన్ లో దక్షిణాదికి చెందిన నాలుగు భాషా చిత్రాల విశేషాలను ఆంగ్లంలో అందించనున్నారు. ఇండియాలోనే తొలి దక్షిణాది ఫిల్మ్ మ్యాగజైన్ అయిన 'సౌత్ స్కోప్'ను చెన్నైలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో లాంఛనంగా ఆష్కరించారు. కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, విక్టరీ వెంకటేష్, శరత్ కుమార్, అల్లు శిరీష్ తదితరులు ఒకే వేదికపైకి వచ్చి ఈ మ్యాగజైన్ ను ఆవిష్కరించడం విశేషం. అల్లు శిరీష్ ఆ విశేషాలను హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలియజేస్తూ, తాను చెన్నైలో పుట్టి పెరిగాననీ, అప్పట్లో దక్షిణాది సినిమాలన్నీ చెన్నైలోనే రూపొందేవనీ, ఆ తర్వాత క్రమంలో ఆయా చిత్ర పరిశ్రమలు తమ రాష్ట్ర రాజధానులకు తరలి వెళ్లాయనీ అన్నారు. ఈ నాలుగు సినీ పరిశ్రమ విశేషాలను ఒకే గొడుకు కిందకు తీసుకు రావాలనే లక్ష్యంతో 'సౌత్ స్కోప్' మ్యాగజైన్ కు శ్రీకారం చుట్టామని అన్నారు. బయట ప్రపంచానికి దక్షిణాది సినిమా వాణిని వినిపించబోతున్నామని పేర్కొన్నారు. తాను ముంబైలో డిగ్రీ చదువుతున్నప్పుడు తన మిత్రులు దక్షిణాది సినిమాల పట్ల ఆసక్తి కనబరచే వారనీ, అయితే ఆ లోటును భర్తీ చేసే ఇంగ్లీషు మ్యాగజైన్ ఏదీ లేకపోయిందనీ, తాను 'సౌత్ స్కోప్' మ్యాగజైన్ స్థాపించడానికి ఇదో కారణమనీ చెప్పారు. పత్రిక సంపాదకులు వనజ మాట్లాడుతూ, 50 శాతం సినిమాలో దక్షిణాదిలోనే రూపొందుతున్నప్పటికీ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమేననే అభిప్రాయం ఇండియా వెలుపల ఉందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని దక్షిణాది సినిమా విశిష్టతను చాటిచెప్పే విధంగా తొలిసారి ఆంగ్లంలో 'సౌత్ స్కోప్' మ్యాగజైన్ తీసుకువస్తున్నట్టు చెప్పారు.
No comments:
Post a Comment