తెలుగు కుర్రాడే అయినా తమిళంలో మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాతే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో విశాల్. 'ప్రేమచదరంగం' అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ 'పందెంకోడి', 'పొగరు' చిత్రాలు ఆయనను సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టాయి. అయితే కొద్దికాలంగా ఆయన చిత్రాలేవీ సక్సెస్ కు నోచుకోలేదు. 'భరణి' ఫరవాలేదనిపించుకుంటే, 'సెల్యూట్', 'పిస్తా' చిత్రాలు ఫ్లాప్ ముద్రపడ్డాయి. దీంతో కొద్ది గ్యాప్ తీసుకున్న విశాల్ ఇప్పుడు మాస్ హీరో ఇమేజ్ కు భిన్నంగా రొమాంటిక్ హీరో అవతారం ఎత్తారు. తొలిసారి ప్లేబాయ్ తరహా పాత్రలో ఆయన నటిస్తున్న 'తీర్ధ విలయాట్టు పిళ్లై' చిత్రాన్ని తెలుగులోకి 'కిలాడి' పేరుతో అనువదిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ను ఓ చిన్న నిర్మాతకు 5 లక్షలు చెల్లించి నిర్మాత విక్రమ్ కృష్ణ సొంతం చేసుకున్నట్టు సమాచారం.రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'కిలాడి' చిత్రంలో విశాల్ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. విశాల్ తో రొమాన్స్ చేస్తున్న ప్రధాన హీరోయిన్లలో నీతుచంద్ర, సారాజైన్, తనుశ్రీదత్తా ఉండగా, మరో ఇద్దరు తక్కువ నిడివి పాత్రల్లో హీరోతో రొమాన్స్ చేయబోతున్నారు. జి.కె.ఫిలింస్ పతాకంపై విక్రమ్ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరు దర్శకుడు. ప్రకాష్ రాజ్, మౌళి, సంతానం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
No comments:
Post a Comment