పద్మశ్రీ కమల్ హాసన్ కు తన సినీ గురువు కె.బాలచందర్ తో ఓ సినిమా చేయాలనే చిరకాల కోరిక ఇప్పుడు నెరవేరనుంది. తన గురువు కోసం కొద్దికాలం క్రితమే కమల్ ఒక పక్కా స్క్రిప్టును రెడీ చేశారు. అయితే బాలచందర్ మాత్రం కెమెరా ముందుకు రావడానికి విముఖత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు బాలచందర్ వైఖరిలోనూ మార్పు వచ్చింది. ఇటీవలే తన సొంత డైరెక్షన్ లో తీసిన 'పోయ్' (తెలుగులో 'అబద్ధం') చిత్రంలో ఓ కీలక పాత్రను బాలచందర్ పోషించారు. ప్రస్తుతం 'మురియాది', 'రెట్టై సుళి' చిత్రాల్లోనూ ఆయన నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలచందర్ తో తాను తీయాలనుకుంటున్న చిత్రం గురించి ఇటీవల కమల్ సంప్రదించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే అసలు సర్ ప్రైజ్ ఇక్కడతో ముగియలేదు. 'విరుమాండి' చిత్రం నుంచి కమల్ తో పలు చిత్రాలకు పనిచేసిన కమల్ ఆప్తమిత్రురాలు గౌతమి ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహించబోతోంది. తొలి సినిమాకే కె.బాలచందర్ వంటి దిగ్దర్శకుని డైరెక్ట్ చేసే అవకాశం దక్కడం గౌతమి అదృష్టంగానే చెప్పాలి.మరో విషయం ఏమిటంటే...కమల్ 'ఉన్నైపోల్ ఒరువన్' (ఈనాడు) చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఆయన కుమార్తె శ్రుతి హాసన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. మరో కీలక పాత్రను మాధవన్ పోషించనున్నారు. మరి కమల్ వ్యవహారమో? ఆయన ప్రస్తుతానికి స్క్రిప్టు విషయం చూసుకుంటున్నారు. ఓ రకంగా ఇది కమల్ ఫ్యామిలీ సభ్యులంతా కలిసి పనిచేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడటం సహజం. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కమల్ నుంచి వచ్చే అవకాశాలున్నాయి.
No comments:
Post a Comment