కామెడీని నమ్ముకున్నప్పుడల్లా హిట్ కొట్టి...తన పంథా మార్చుకున్నప్పుడల్లా ఇక్కట్లు పాలయిన దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరోసారి ప్రేక్షకులను 'బురిడీ' కొట్టించబోతున్నారు. అదెలా అని విపరీత అర్థాలు వెతుక్కోనవసరం ఎంతమాత్రం లేదు. విలక్షణమైన టైటిల్స్ ఎంపిక చేయడంలో సిద్ధహస్తుడైన ఇవివి సత్యనారాయణ తన కుమారుడు ఆర్యన్ రాజేష్ కథానాయకుడుగా తెరకెక్కించనున్న కొత్త చిత్రానికి 'బురిడీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇవివి పెద్ద కుమారుడైన ఆర్యన్ రాజేష్ సుమారు ఓ పది చిత్రాల్లో నటించినప్పటికీ 'ఎవడిగోల వాడిదే' వంటి ఓ హిట్, 'లీలా మహల్ సెంటర్'తో ఓ యావరేజ్ మాత్రమే దక్కాయి. యువ హీరోల రేసులో ఆర్యన్ రాజేష్ బాగా వెనుకబడటంతో ఇవివి ఇప్పుడు ఆర్యన్ పై దృష్టి సారించారు. ఈమధ్యనే తన చిన్నకుమారుడు అల్లరి నరేష్ కు 'బెండు అప్పారావు ఆర్ఎంపి' చిత్రంతో హిట్ ఇచ్చిన ఇవివి అదే ఊపులో ఆర్యన్ రాజేష్ వైపు మళ్లారు. ఆసక్తికరంగా ఇది ఇవివి 50వ చిత్రం కూడా కావడం విశేషం. తొలుత ఈ చిత్రాన్ని 'ఎవడిగోల వాడిదే' చిత్రానికి సీక్వెల్ గా లార్ స్కో ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై లగడిపాటి శ్రీధర్ నిర్మించేందుకు సన్నాహాలు జరిగాయి. అయితే చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ చేతులు మారింది. బిగ్ బి ప్రొడక్షన్ పతాకంపై దుబాయ్ కు చెందిన ప్రవాసాంధ్రుడు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రంలో పరిశ్రమకు చెందిన దాదాపు అందరు హాస్యనటులు నటించబోతున్నారు. కొత్త సంవత్సరం తొలిరోజైన జనవరి 1న 'బురిడీ' షూటింగ్ ప్రారంభమవుతుంది
No comments:
Post a Comment