పరుచూరి రవీంద్రనాథ్ ('జంక్షన్' ఫేమ్ ) కథానాయకుడుగా ఉషామాధురి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై నెక్కంటి రామారావు నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో సోమవారంనాడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఉదయ్ కుమార్ దర్శకుడు. ముహూర్తం సన్నివేశానికి పద్మావతి రామారావు కెమెరా స్విచ్చాన్ చేయగా, సుజాత ఉదయ్ కుమార్ క్లాప్ ఇచ్చారు. పరుచూరి సోదరులు ఈ చిత్రానికి రచన చేస్తున్నారు.పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రవీంద్రనాథ్ బాడీ లాంగ్వేజ్ కు తగిన కథ ఇదనీ, శ్రీలంకకు చెందిన అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నామనీ చెప్పారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి కావడంతో షూటింగ్ ప్రారంభించామని అన్నారు. అమెరికాలో 20 రోజుల షెడ్యూల్ కు ప్లాన్ చేసినట్టు తెలిపారు. హీరో తండ్రిగా తనికెళ్ల భరణి, మేనమామగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని తెలిపారు. కథాపరంగా హీరో తండ్రి అతన్ని తప్పుడు మార్గంలోకి నడిపిస్తే హీరోయిన్ అతన్ని సరైన మార్గంలోకి తీసుకువస్తుందని అన్నారు. పరుచూరి బ్రదర్స్ అబ్బాయి సినిమా అంటే అంచనాలుంటాయనీ, అందుకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందనీ పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. తప్పుడు మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరానికి మించి డబ్బులు ఇస్తే వారి జీవితాలు ఎలా తయారవుతాయనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇతని నిర్మాత రామారావు తెలిపారు. మంచి సినిమాలు నిర్మించాలనే లక్ష్యంతోనే తాము సినీరంగంలోకి వచ్చినట్టు పేర్కొన్నారు. ఇదొక వైవిధ్యమైన కథా చిత్రమనీ, మంచి టీమ్ వర్క్ తో సినిమా చేస్తున్నామనీ దర్శకుడు ఉదయ్ కుమార్ చెప్పారు. గతంలో పలు ట్రెండ్ సెట్టర్ సినిమాలు చేసిన ఉదయ్ కుమార్ ఈ సినిమా చేస్తానని ఒప్పుకోవడం సంతోషంగా ఉందని హీరో రవీంద్రనాథ్ తెలిపారు. డి.రామనాయుడు, బి.గోపాల్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఆలీ, దర్శకుడు సురేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో సాయికుమార్, రవిబాబు, బ్రహ్మానందం, కోట, ధర్మవరపు, ఆలీ, వేణుమాధవ్, గౌతంరాంజు తదితరులు నటించనున్నారు. పరుచూరి సోదరులు రచన, జొన్నవిత్తుల-సుద్దాల-వెనిగెళ్ల రాంబాబు పాటలు, రామ్ గుణశేఖర్ సినిమాటోగ్రఫీ, జాన్ పీటర్ సంగీతం అందించనున్నారు.
No comments:
Post a Comment