చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం గతంలో ఎన్నడూ ఎరుగదు. స్లంప్, టిక్కెట్ల ధరలు వంటి ఎన్నో సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ 'ఆర్థికమాంద్యం' కోరల్లో చిక్కుకోకుండా బయటపడినా.. 'ప్రాంతాల' వారీ ఆందోళనలు మాత్రం అనూహ్యంగా చిత్ర పరిశ్రమను ఇప్పుడు సంక్షోభం అంచుల్లోకి నెట్టేస్తోంది. బంద్ లు, థియేటర్లు-షూటింగ్ లపై దాడులతో అట్టుడికిపోతున్న తరుణంలో ఏ కొత్త సినిమా రిలీజ్ చేసినా అది సాహసమే అవుతుంది. అలాగని రిలీజ్ కు సిద్ధం చేసి కూడా థియేటర్ల ముందుకు రాకపోతే వడ్డీల చెల్లింపు రూపంలో నిర్మాత కోట్లలో మునిగిపోవాల్సి వస్తుంది. ఇదో 'చిత్ర' మైన పరిస్థితి. ప్రస్తుత రాజకీయ పరిణాలతో థియేటర్ల వైపు కూడా కన్నెత్తి చూడటానికి సాహసించని జనం ఇప్పుడు కొద్దిపాటి 'ఫెస్టివ్' మూడ్ లోకి వచ్చారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని చివరి నిమిషంలో 'బంద్' కు రిలాక్స్ ఇవ్వడంతో కొందరు నిర్మాతలు రిలాక్స్ అవుతున్నారు. శత చిత్రాల దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి సొంత బ్యానర్ పై తన కుమారుడు వైభవ్ హీరోగా నిర్మించిన 'కాస్కో' చిత్రాన్ని ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. కామెడీ చిత్రాల దిట్టగా పేరున్న దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈసారి తనదైన శైలిలో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు జరిగిన ప్రచారం ఓ మోస్తరు అంచనాలకు తావిచ్చింది. పెద్ద హీరోల సినిమాలు వెనక్కి మళ్లిన తరుణంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన 'కాస్కో' ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తుందనేది విశ్లేషించుకుంటే...పవన్ కల్యాణ్ అలియాస్ వంశీ (వైభవ్) ఒక లక్ష్యంతో హైద్రాబాద్ రాగానే అక్కడ మహేష్ బాబు (బ్రహ్మానందం) పరిచయమవుతాడు. గూండాలు ఎక్కడున్నా ఏరిపారేయాలన్నదే మహేష్ బాబు సింగిల్ పాయింట్ ఎజెండా. వంశీ తన పేరును పవన్ గా పరిచయం చేసుకుంటా ఆయనకు శిష్యుడై పోతాడు. ఈ క్రమంలోనే మహేష్, వంశీలు స్థానిక గూండా జె.పి. (జయప్రకాష్ రెడ్డి)కి పక్కలో బల్లెం అవుతారు. గురుశిష్యులకు బుద్ధి చెప్పేందుకు జె.పి. పంపించిన సలీమ్ ను వంశీ అంతం చేస్తాడు. మరో గూండా అల్లావుద్దీన్ ను కిడ్నాప్ చేస్తాడు. అసలు వంశీకీ ఈ గూండాలకూ ఉన్న సంబంధం ఏమిటి? కథ ఓ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. వైజాగ్ లో ఉండే వంశీ అక్కడ రేడియో జాకీగా పనిచేసే కృష్ణవేణి (శ్వేతబసు ప్రసాద్)ని చూపి మనసు పారేసుకుంటాడు. కొన్ని సంఘటనల తర్వాత కృష్ణవేణి సైతం అతన్ని ఇష్టపడుతుంది. ఆ విషయం అతనితో చెప్పేందుకు వచ్చిన కృష్ణవేణిని సలీమ్, అల్లావుద్దీన్ ఎత్తుకుపోతారు. దాంతో తన ప్రేయసిని వెదుక్కుంటూ వంశీ హైదరాబాద్ వచ్చి మహేష్ బాబును కలుస్తాడు. కృష్ణవేణి ఎక్కడుంది? 'కాస్కో' అంటూ గూండాలకు సవాలు విసిరిన వంశీ ఆమె ఆచూకి తెలుసుకుని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.
No comments:
Post a Comment