హీరోల ట్రయాంగిల్ ఫైట్!

'ఆర్య-2' చిత్రం విడుదల కావడంతో డిసెంబర్ టార్గెట్ గా వరుస చిత్రాలు రిలీజ్ తేదీలు ప్రకటించుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. సహజంగా ఫిల్మ్ మేకర్స్ డిసెంబర్ మాసాన్ని అంతగా అచ్చిరాని సీజన్ గా భావిస్తుంటారు. అయితే ఈ ఏడాది ముగియడానికి మరో నెలరోజులు మాత్రమే ఉండటంతో పలువురు నిర్మాతలు ఇంకెంత మాత్రం జాప్యం చేయకుండా తమ కొత్త చిత్రాల విడుదలకు సన్నద్ధమవుతున్నారు. ఈ వారంలో ముచ్చటగా మూడు సినిమాల బరిలోకి దిగుతున్నాయి. అల్లరి రవిబాబు ఈ మాసం తొలి బోణిగా 'అమరావతి' చిత్రాన్ని 3వ తేదీన బరిలోకి దింపుతున్నారు. ఇందులో భూమిక, స్నేహ ప్రధాన పాత్రలు పోషించగా, హీరో నందమూరి తారకరత్న తొలిసారి సైకో కిల్లర్ గా నెగిటివ్ పాత్ర పోషించారు. తొలి సన్నివేశం నుంచి ఎండింగ్ కార్డ్స్ వరకూ ఉత్కంఠ కలిగించే థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రవిబాబు తెరకెక్కించినట్టు నిర్మాత వి.ఆనంద ప్రసాద్ చెబుతున్నారు. ఈ థ్రిల్లర్ పై ప్రేక్షకులు కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.'అమరావతి' చిత్రానికి పూర్తి భిన్నమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా 'ప్రవరాఖ్యుడు' తెరకెక్కింది. 'పెళ్లైన కొత్తలో' వంటి సక్సెస్ చిత్రం తర్వాత మళ్లీ జగపతిబాబు-ప్రియమణి-దర్శకుడు మదన్ కాంబినేషన్ లో 'ప్రవరాఖ్యుడు' రూపొందింది. ఈనెల 4న వస్తున్న ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా జగపతిబాబుకు ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉన్న ఇమేజ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ రెండు చిత్రాల మధ్య 'సారాయి వీర్రాజు' కూడా 4వ తేదీన ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. విలనీ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటించారు. ఇది పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. రాజమౌళి శిష్యుడు డి.ఎస్.కణ్ణన్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై కూడా తగినన్ని అంచనాలున్నాయి. ఓవరాల్ గా...హీరో నుంచి విలన్ గా మారిన తారకరత్న, ఫ్యామిలీ ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న జగపతిబాబు, విలన్ పాత్రల నుంచి హీరోకి టర్న్ అయిన అజయ్ మధ్య జరుగుతున్న ఈ ట్రయాంగిల్ ఫైట్ లో విజేత ఎవరనేది వారాంతంలో తేలనుంది.

No comments:

Post a Comment