కాస్కో..ఇంకోసారి..వెనక్కి!

రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ వాతావరణం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను బెంబేలెత్తిస్తోంది. తెలంగాణా బంద్ ల తర్వాత ఇప్పుడు ఆంధ్ర, సీమ ప్రాంతాల్లో వరుస బంద్ ల ప్రభావం కొత్త రిలీజ్ లపైనా, వాటి ఫలితాలపైన బలంగా పడుతోంది. గత వారంలో విడుదలైన మూడు చిత్రాలకూ కలెక్షన్లు అంతగా లేకపోవడం, నెగిటివ్ టాక్ ప్రతిబంధకంగా మారింది. దీంతో ఈ వారంలో విడుదలకు సిద్ధమైన 'కాస్కో', 'ఇంకోసారి' చిత్రాలు వెనక్కి మళ్లాయి.వైభవ్, శ్వేతబసు ప్రసాద్ జంటగా కోదండరామిరెడ్డి సమర్పణలో జి.నాగశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన 'కాస్కో' చిత్రం ఈనెల 11న విడుదల కావలసి ఉండగా అది 18వ తేదీకి మళ్లింది. అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా మరోసారి మారింది. త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటిస్తామని కోదండరామిరెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. రాజా, మంజరి ఫడ్నిస్, రిచా పల్లాడ్ నాయకానాయికలుగా విడుదలకు సిద్ధమైన 'ఇంకోసారి' చిత్రం సైతం ఈనెల చివరి వారానికి వాయిదా పడింది. తొలుత ఈనెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. సుమన్ పాతూరి దర్శకత్వంలో కల్యాణ్ పల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. వరుసగా రెండు చిత్రాలు విడుదల తేదీలు వాయిదా వేసుకోవడంతో ఈ శుక్రవారంనాడు ఒక్క తెలుగు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. జేమ్స్ కామరన్ హాలీవుడ్ 'అవతార్' చిత్రం ఒక్కటే తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది

No comments:

Post a Comment