హైదరాబాద్: అల్లు అర్జున్ కథానాయకుడుగా గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న 'వరుడు' చిత్రం షూటింగ్ పై బుధవారంనాడు టిఆర్ఎస్, ఎబివిపి కార్యకర్తలు దాడి చేశారు. ఈ అనూహ్య సంఘటనతో యూనిట్ సభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయగా, ఆందోళన కారులు షూటింగ్ సామాగ్రిని ధ్వసం చేసి భయోత్పాతం సృష్టించారు. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో అనాజ్ పూర్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. సుమారు 200 మంది తెరాస, ఎబివిపి కార్యకర్తలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి షూటింగ్ స్పాట్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. మంచు మనోజ్ షూటింగ్ పై మంగళవారం సాయంత్రం దాడి జరిగిన 24 గంటలు కూడా తిరక్కముందే అల్లు అర్జున్ 'వరుడు' షూటింగ్ పై దాడి జరగడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి కార్యాచరణకు సన్నద్ధమవుతోంది.'వరుడు' చిత్రంపై జరిగిన దాడి గురించి చిరంజీవికి కూడా ఇప్పటికే సమాచారం అందిందని తెలుస్తోంది. ఈ దాడిని యువహీరో మంచు మనోజ్ తీవ్రంగా ఖండించారు. ఇది 'పిరికి పందల' చర్య అని అభివర్ణించారు. ఇలాంటి దాడులకు బెదరిపోయి షూటింగ్ లు మానుకోవడం జరగదనీ, సోదరుడు లాంటి అల్లు అర్జున్ కు తాము అండగా ఉంటామని అన్నారు. దాసరి నారాయణరావు నేతృత్వంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కార్యాచరణకు దిగే అవకాశముందని ఆయన సూచన ప్రాయంగా తెలిపారు. కాగా, 'వరుడు' షూటింగ్ పై దాడి జరిగినట్టు చెబుతున్న తరుణంలో అల్లు అర్జున్ లంచ్ కు వెళ్లారనీ, యూనిట్ సభ్యులతో పాటు, దర్శకుడు గుణశేఖర్ సైతం తీవ్ర భయాందోళనతో పరుగులు పెట్టారని తెలిసింది. సంఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పలువురుని అదుపులోనికి తీసుకున్నట్టు సమాచారం అందింది.
No comments:
Post a Comment