'చిరుత'తో తొలి అడుగు వేసి 'మగధీర'తో తెలుగు సినిమా రికార్డులను బద్దలుకొట్టిన రామ్ చరణ్ తదుపరి చిత్రంపై సహజంగానే మంచి అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన మూడో చిత్రం సొంత బ్యానర్ లాంటి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. 'బొమ్మరిల్లు', 'పరుగు' వంటి హిట్ చిత్రాలను అందించిన భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇటు రామ్ చరణ్ కు, అటు భాస్కర్ కు ఇది ముచ్చటగా మూడో చిత్రం కావడం విశేషం. దీనికి 'యాపిల్' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 7వ తేదీన హైద్రాబాద్ లో ప్రారంభం కానుంది.ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథా ఇతివృత్తమనీ, ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ అనీ నిర్మాత నాగబాబు తెలియజేశారు. సున్నితమైన ప్రేమకథా ఇతివృత్తాలను, కుటుంబ భావోద్వేగాలను ఎంతో చక్కగా తెరకెక్కించడంలో భాస్కర్ దిట్ట అనీ, రామ్ చరణ్ కు ఇదో మంచి చిత్రమవుతుందనీ ఆయన చెబుతున్నారు. ఇందులో రామ్ చరణ్ అమ్మాయిల మానసచోరుడుగా కనిపించబోతున్నారనే ప్రచారం కూడా ఉంది. రామ్ చరణ్ కు జోడిగా జెనీలియా నటించనుంది. ఈ చిత్రంలోని ఎక్కువ భాగం షూటింగ్ అమెరికాలో ప్లాన్ చేసినప్పటికీ కారణాంతరాల వల్ల ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుపబోతున్నారు. ఈనెల 7 నుంచి 12 వరకూ హైద్రాబాద్ లో షూటింగ్ జరిపి చిత్రయూనిట్ ముంబై చేరుకుంటుంది. అక్కడ ఓ పది రోజుల షెడ్యూల్ అనంతరం ఆస్ట్రేలియాకు షిఫ్ట్ అవుతారు. ఇక్కడ 3 నెలల పాటు కీలకమైన షెడ్యూల్ జరుగుతుందనీ, ఆ తర్వాత చిత్రయూనిట్ హైద్రాబాద్ చేరుకుంటుందనీ తెలుస్తోంది. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు
No comments:
Post a Comment