కాలేజీ నేపథ్యంలో 'బద్మాష్'

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఇటీవలే 'అమ్ములు' చిత్రంతో నటుడిగా మారి ఇప్పుడు దర్శకుడిగా కూడా మెగాఫోన్ పడుతున్నారు. ఆయన తొలిసారి 'బద్మాష్' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నాగ సిద్దార్థ్, ఏక్తా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. జి.పి. సిద్దార్థ ఫిల్మ్ అకాడమీపై డాక్టర్ జి.నాగయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సోమవారంనాడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్లాప్ ఇవ్వగా, హీరో గోపీచంద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు భీమినేని శ్రీనివాసరావు, ఎన్.శంకర్ గౌరవదర్శకత్వం వహించారు. అంతకుముందు టైటిల్ లోగోను సీనియర్ నటుడు మురళీమోహన్, నిర్మాత పోకూరి బాబూరావు ఆవిష్కరించారు.వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, గాయకుడుగా, సంగీత దర్శకుడుగా తనను పరిశ్రమలోని వారు ఎంతగానో ఆదరించారనీ, 200 సినిమాలకు పనిచేసిన తాను అభిరుచితో ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాననీ అన్నారు. నెగిటివ్ నుంచి పాజిటివ్ గా మారిన వ్యక్తి ఎలా ఉంటాదన్నది ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నామనీ, ఈ చిత్రం తనకు దర్శకుడిగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాననీ అన్నారు. నేటి కాలేజీలలో ఏం జరుగుతోందన్నది ప్రతిబింబించే చిత్రమిదని నిర్మాత నాగయ్య తెలిపారు. విద్యార్థుల వ్యవహార శైలి ఇందులో చూపిస్తున్నామనీ, ప్రత్యేకించి సందేశాలు ఇవ్వనప్పటికీ అంతర్లీనంగా మాత్రం సందేశం ఉంటుందన్నారు. డిసెంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నెలరోజుల పాటు షూటింగ్ జరుపుతామనీ, జనవరి 10 నుంచి జరిగే రెండో షెడ్యూల్ లో పాటలు చిత్రీకరించి, ఫిబ్రవరి 14న సినిమా విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రం తమ కెరీర్ కు మంచి మలుపు అవుతుందని నాగ సిద్దార్ధ, ఏక్తా పేర్కొన్నారు. ఇది చక్కటి కాలేజీ ఎంటర్ టైనర్ అని మాటల రచయిత వెలిగొండ శ్రీనివాసరావు చెప్పారు. సత్యానంద్, ఎడిటిర్ కృష్ణారెడ్డి కూడా మాట్లాడారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, సుమన్, ధర్మవరపు, బాబూమోహన్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, సత్యానంద్ తదితరులు నటిస్తున్నారు. పి.వి.గిరి కథ, వెలిగొండ మాటలు, చంద్రబోస్-అనంత్ శ్రీరామ్- రామజోగయ్య శాస్త్రి పాటలు, ఎన్.సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, కె.వి.కృష్ణారెడ్డి ఎడిటింగ్, గణేష్ ఫైట్స్, సంగీతం వందేమాతరం శ్రీనివాస్ అందిస్తున్నారు.

No comments:

Post a Comment