జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ తన 'పయనం' కోసం విమానం హైజాగ్ చేయబోతున్నారు. అయోమయంగా ఉంది కదూ. 1999లో కాందహార్ లో చోటుచేసుకున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ హైజాక్ ఉదంతం ఆధారంగా ఆయన తదుపరి చిత్రం ఉండబోతోంది. దీనికి 'పయనం' అనే టైటిల్ కూడా ఖరారైంది. రాథామోహన్ ('ఆకాశమంత' ఫేమ్) దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజ్ నిర్మించబోతున్నారు. తొలుత ట్రయిన్ జర్నీగా ఈ చిత్ర కథ నడుస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు 'ఫ్లైట్ జర్నీ'గా ఈ పయనం సాగనుంది. హైజాక్ అయిన విమానానికి చెందిన పైలట్...కెప్టెన్ దేవి శరణ్ రాసిన 'ఫ్లైట్ ఇన్ టు ఫియర్' అనే పుస్తకం స్ఫూర్తితో కొన్ని కల్పిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.చెన్నైలో బయలుదేరిన 15 నిమిషాలకే ఒక విమానం హైజాక్ అయి తిరుపతి విమానాశ్రయంలో బలవంతంగా ల్యాండ్ అవుతుందట. దీని చుట్టూనే కథ నడుస్తుందని సమాచారం. తిరుపతి ఎయిర్ పోర్ట్ ను పోలిన భారీ సెట్ ను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన మంత్రి కార్యాలయానికి చెందిన బ్యూరోక్రాట్ పాత్రను ప్రకాష్ రాజ్ పోషించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అన్నట్టు...తెలుగు వెర్షన్ లో ముష్కరుల నుంచి విమాన ప్రయాణికులను రక్షించే సాహస హీరో పాత్రను నాగార్జున పోషించబోతున్నారు.
No comments:
Post a Comment