బోర్డర్ దాటిన 'సలీమ్'

మంచు మనోజ్ కథానాయకుడుగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్, రిలయెన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించిన 'సలీమ్' చిత్రం ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రం సరిహద్దులు కూడా దాటి మహారాష్ట్రలో 35కు పైగా థియేటర్లలో విడుదల కానుంది. ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ సెంటర్లలో భారీ అంచనాలున్న తెలుగు చిత్రాలు విడుదల కావడం సర్వసాధారణమే అయినా ఒక తెలుగు సినిమా వేరే రాష్ట్రంలో ఇన్ని థియేటర్లలో విడుదల కావడం మాత్రం ఇదే మొదటిసారి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం 5 థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది.లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై 50కి పైగా చిత్రాలు నిర్మించిన డాక్టర్ ఎం.మోహన్ బాబు ఈ చిత్రాన్ని 23 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమ బ్యానర్ లో అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందించిన చిత్రమిదనీ, విష్ణు కెరీర్ లోనే ఓ మరపురాని చిత్రంగా ఇది నిలుస్తుందనీ మోహన్ బాబు ధీమా వ్యక్తం చేశారు. సందీప్ చౌతా సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే మంచి సక్సెస్ సాధించడంతో పాటు హీరో నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించడం మరో విశేషం. ఇందులోని పాత్ర కోసం విష్ణు తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడంతో పాటు పలు రిస్కీ షాట్స్ లో సైతం నటించారు. మోహన్ బాబు ఇందులో ఓ డాన్ పాత్ర ను పోషించగా, అందాల ఖజానాగా యువ ప్రేక్షకులను సమ్మోహన పరుస్తున్న ఇలియానా హీరోయిన్ గా నటించింది. 'దేవదాసు' వంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ ఇలియానా, దర్శకుడు వై.వి.ఎస్. కాంబినేషన్ చిత్రం కావడంతో సహజంగానే మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వెంకట్, కావేరీ ఝా, గిరిబాబు, నెపోలీయన్, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ముఖేష్ రుషి తదితరులు నటించారు. చింతపల్లి రమణ మాటలు, చంద్రబోస్ పాటలు, సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.

No comments:

Post a Comment