దాడి హేయం: మోహన్ బాబు

హైదరాబాద్ : కళాకారులకు ప్రాంతీయ భేదాలు లేవనీ, తన కుమార్తె సినిమా షూటింగ్ పై దాడి జరగడం హేయమైన చర్య అనీ ప్రముఖ నటుడు మోహన్ బాబు తీవ్రంగా స్పందించారు. మంచు మనోజ్ కథానాయకుడుగా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ హైద్రాబాద్ శివార్లలోని కొంపల్లి వద్ద ఒక ఇంట్లో మంగళవారం జరుగుతుండగా టిఆర్ఎస్ శ్రేణులు షూటింగ్ ను అడ్డుకుని భయాందోళనలు సృష్టించిన నేపథ్యంలో మోహన్ బాబు తీవ్ర స్థాయిలో స్పందించారు.'తెలంగాణ కావాలని అడిగే హక్కు వారికి ఎంత ఉందో సమైక్య ఆంధ్ర కావాలనే హక్కు మాకు అంతే ఉంది. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు? తెలంగాణా అడుగుతుంటే మేం ఎవరూ కాదనలేదు. అలాగే సమైక్య వాదం వినిపించే హక్కు మాకు ఉంది. యుద్ధ వాతావరణం వద్దు. నా బిడ్డ షూటింగ్ చేస్తుంటే నేను లేకుండా గొడవ చేస్తారా? హేయంగా ప్రవర్తిస్తారా? మళ్లీ మళ్లీ ఇక్కడే షూటింగ్ చేస్తాను. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. రాయలసీమలో పుట్టిన వాడిని. గొడ్డు కారం తిన్నవాడిని. పిరికివాడిని కాదు. గుండాలను ఉసికొలితే అంతకంటే ఎక్కువ దమ్మున్న వాడిని. అమాయకులైన ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇలా రౌడీలను పంపించుకుంటూ పోతే హైదరాబాద్ స్మశాన వాటిక అవుతుంది. తస్మాత్ జాగ్రత్త' అని ప్రముఖ నటుడు మోహన్ బాబు నిప్పులు చెరిగారు.

No comments:

Post a Comment