నాగార్జున కథానాయకుడుగా అన్నపూర్ణ సినీ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి 'కేడీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి కిరణ్ దర్శకుడు. హైద్రాబాద్ లోని నోవాటెల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత శివప్రసాద్ రెడ్డి ఈ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, కిరణ్, నటుడు అంకుర్ ('స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్) పాల్గొన్నారు.నాగార్జున మాట్లాడుతూ, 'రమ్మీ', 'మాయగాడు', 'మోసగాడు' వంటి పలు టైటిల్స్ పరిశీలించిన అనంతరం చివరకు కేడీ అనే టైటిల్ ను ఖరారు చేశామని చెప్పారు. 'రమ్మీ' అనే టైటిల్ ను ఎవరో రిజిస్టర్ చేశారనీ, అప్పట్నించీ సినిమా టైటిల్ అదేనంటూ ప్రచారం జరిగిందనీ అన్నారు. అయితే టైటిల్ కావాలంటే 13 లక్షలు ఇమ్మని సదరు వ్యక్తి బేరం పెట్టినట్టు చెప్పారు. ఫలానా సినిమాకి ఫలానా టైటిల్ పెట్టే అవకాశాలున్నాయని తెలుసుకుని వాటిని రిజిస్టర్ చేయించి పెద్ద నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేయడం ఒక బిజినెస్ గా మారుతోందన్నారు. కేడీ విషయానికి వస్తే...ఇందులో తాను కొత్త తరహాలో కనిపిస్తాయనీ, కమర్షియల్ పరిధుల్లో కొద్దిపాటి ఎక్స్ పెర్ మెంట్ చేశామని అన్నారు. ఎంటర్ టైన్ మెంట్ తో ప్రారంభమైన సినిమా సీరియస్ తరహాలో ముగుస్తుందన్నారు. సినిమాలో రొమాంటిక్ సీన్స్ తక్కువేనని అన్నారు. అయితే తన క్యారెక్టర్ లో వెరైటీ షేడ్స్ ఉంటాయని చెప్పారు. 'కింగ్' చిత్రంలో మమతా మోహన్ దాస్ నటన, ప్రొఫెషనిలిజం చూసి ఆమె అభిమానినయ్యాననీ, ఆమె వాయిస్ కూడా బాగుంటుందనీ, అందుకే ఆమెను కేడీలో తీసుకున్నామనీ అన్నారు. దర్శకుడు విషయానికి వస్తే, 'యువ' సీరియల్ కు పనిచేసినప్పటి నుంచి అతను తనకు బాగా తెలుసుననీ, 'కింగ్' తర్వాత ఓ డిఫరెంట్ మూవీ చేయాలనుకున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ తో రావాల్సిందిగా కిరణ్ కు చెప్పాననీ, అలాగే చాలా కాన్ఫిడెంట్ గా కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారనీ, మంచి సంభాషణలు కూడా రాశారనీ తెలిపారు. ఇందులో 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ అంకుర్ ఓ కీలక పాత్ర పోషించారనీ, 'నిన్నే పెళ్లాడతా', 'చంద్రలేఖ', 'సూపర్' చిత్రాలకు అద్భుతమైన సంగీతం ఇచ్చిన సందీప్ చౌతా ఈ చిత్రానికి కూడా మంచి సంగీతం అందించారనీ చెప్పారు.
No comments:
Post a Comment