'భద్రాచలం', 'చందమామ' చిత్రాల కథానాయిక సింధుమీనన్ మరోసారి 'సుభద్ర' చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు జోడిగా రవికిరణ్ అనే కొత్త హీరో పరిచయమవుతున్నారు. బేబీ హరిణి సమర్పణలో శ్రీకాంత్ టాకీస్ పతాకంపై ఇ.శ్రీకాంత్ గౌడ్ నిర్మిస్తున్నఈ చిత్రానికి రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. బ్యానర్ తో పాటు ఈ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్ లో ని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో బుధవారంనాడు జరిగింది. టైటిల్ లోగోను డాక్టర్ డి.రామానాయుడు ఆవిష్కరించగా, బ్యానర్ లోగోను సి.కల్యాణ్ ఆవిష్కరించారు. రెండు పాటలున్న ఈ చిత్రం ఆడియో సీడీని నిర్మాత శ్రీకాంత్ గౌడ్ స్నేహితుడు ప్రభాకర్ యాదవ్ విడుదల చేసి తొలి ప్రతిని డి.రామానాయుడుకు అందజేశారు.రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ, ఇంతవరకూ కామెడీ చిత్రాల దర్శకుడిగా తనకు పేరుందనీ, అయితే అందుకు భిన్నంగా ఓ విభిన్నమైన కథాశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. మహాభారతంలోని సుభద్ర పాత్రలాగా తాము తీస్తున్న 'సుభద్ర' చిత్రంలోని టైటిల్ పాత్ర వివిధ కోణాల్లో ఉంటుందనీ, ఆ పాత్రకు సింధుమీనన్ చక్కటి న్యాయం చేసిందనీ తెలిపారు. రవికిరణ్ అనే నూతన హీరోను పరిచయం చేస్తున్నామనీ, మరో కీలక పాత్రను ఆశిష్ విద్యార్థి పోషించారనీ చెప్పారు. నిర్మాత శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, రాత్రి 10.30 గంటలకు మొదలై తెల్లవారుజామున 5 గంటలకు ముగిసే కథ ఇదనీ, రెండేళ్లుగా సినిమా తీయాలనే అభిరుచితో పలు కథలు వింటూ వచ్చామనీ, రాజా వన్నెంరెడ్డి చెప్పిన కథ నచ్చి ఈ చిత్రం తీశామనీ చెప్పారు. లవ్, ఎంటర్ టైన్ మెంట్ వంటి అంశాలు కలగలిసిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిదని అన్నారు. ఈ చిత్రంలో తాను ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్ గా నటించినట్టు భానుచందర్ పేర్కొన్నారు. నటుడిగా తనకు మంచి పేరు తెచ్చే పాత్ర ఇందులో పోషించినట్టు ఆశిష్ విద్యార్థి తెలిపారు. భార్యాభర్తల బంధంలోని పటిష్టతను ఇందులో ఆవిష్కరించారనీ, తన పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుందనీ సింధుమీనన్ చెప్పారు. తాను ఓ సపోర్టింగ్ పాత్రలో నటించినట్టు నటుడు చిన్నా తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, చలపతిరావు, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, గౌతంరాజు, సురేఖా వాణి, హేమ తదితరులు నటించారు. అనంత్ శ్రీరామ్-భాస్కర భట్ల పాటలు, ఎన్.సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, చక్రి సంగీతం అందించారు.
No comments:
Post a Comment