క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించిన ధర్మవరపు సుబ్రమణ్యం 'ఒక తుపాకి మూడు పిట్టలు' అనే చిత్రం ద్వారా త్వరలో హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఆయన నేపథ్య గాయకుడుగా కూడా పరిచయం కానున్నారు. ఎందరో ఔత్సాహిక కళాకారులను పరిచయం చేసిన దర్శకుడు తేజ తన తాజా చిత్రం 'అటు ఇటు' కోసం ధర్మవరపు చేత ఓ పాట పాడించారు. కల్యాణ్ మాలిక్ ఈ పాటకు కంపోజ్ చేశారు.తేజ ఈ విషయం వెల్లడిస్తూ, ఈ చిత్రంలో ఓ కీలకమైన సాంగ్ కోసం టిపికల్ వాయిస్ అవసరమైందనీ, అప్పుడు ధర్మవరపు గుర్తుకురావడం, ఆయనను అడగ్గానే అంగీకరించడం జరిగిందన్నారు. కల్యాణ్ మాలిక్ స్వరపరచిన ఏడు నిమిషాల పాటను ధర్మవరపు సునాయాసంగా ఆలపించారని చెప్పారు. ఈ చిత్రం ద్వారా కొత్త హీరోహీరోయిన్లను కూడా పరిచయం చేస్తున్నామనీ, రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర'లో నటిస్తున్న రాధికా ఆప్టే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారనీ చెప్పారు. ఈ చిత్రంలో మొత్తం ఏడు పాటలు ఉంటాయనీ, 31 నుంచి చిత్రీకరణ మొదలవుతుందనీ తెలిపారు. పాండిచ్చేరి, వైజాగ్ లలో ఎక్కువ భాగం షూటింగ్ ప్లాన్ చేసినట్టు చెప్పారు. ధర్మవరపు మాట్లాడుతూ, గాయకుడిగా మారి ఈ చిత్రంలో పాట పాడటం కొత్త అనుభూతినిచ్చిందనీ, ఎంజాయ్ చేస్తూ పాడానని అన్నారు. పాట విన్నాక శ్రోతలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీవల్లీ తేజ నిర్మిస్తుండగా, రసూల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
No comments:
Post a Comment