సినీ స్టార్స్ ను టార్గెట్ చేసుకున్న తెలంగాణ ఉద్యమకారులు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఫామ్ హౌస్, ఆ పార్టీ యువజన విభాగం 'యువరాజ్యం' అధ్యక్షుడు, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ గెస్ట్ హౌస్ పై గురువారంనాడు విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. సామాజిక తెలంగాణ నినాదం నుంచి సమైక్యాంధ్ర వైపు మళ్లిన చిరంజీవిని, ఆయన కుటుంబ సభ్యులను అడ్డుకుంటామని తెలంగాణ శ్రేణులు అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ఈ దాడుల క్రమం మొదలైంది. బుధవారంనాడు అల్లు అర్జున్ 'వరుడు' షూటింగ్ పై దాడి చేసిన టిఆర్ఎస్ శ్రేణులు గురువారంనాడు మెదక్ జిల్లా మంబాపూర్ వద్ద ఉన్న చిరంజీవి ఫామ్ హౌస్ పై దాడి చేశారు. దాడిలో ఫామ్ హౌస్ పాక్షికంగా ధ్వంసమైంది. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి మండలం ధన్వాడ వద్ద ఉన్న పవన్ కల్యాణ్ గెస్ట్ హౌస్ ను కూడా ఆందోళనకారులు అటాక్ చేశారు.రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో జరుగుతున్న ప్రిన్స్ మహేష్ బాబు సినిమా యూనిట్ పై కూడా గురువారం ఉదయం ఆందోళన కారులు పెద్దఎత్తున దాడి చేసి కోటి రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన భారీ సెట్స్ కు నిప్పంటించి, కెమెరాలు, ఇతర షూటింగ్ పరికరాలు ధ్వసం చేశారు. సినిమా వాళ్ల ఆస్తులు, షూటింగ్ లపై వరుస దాడులు జరుగుతున్నా చిరంజీవి, మోహన్ బాబు, అల్లు అరవింద్ వంటి కొందరు మినహా పరిశ్రమకు చెందిన పెద్దలెవరూ పెదవి విప్పకపోవడం మరింత ఉద్రిక్తతలకు ఊతమిస్తోంది
No comments:
Post a Comment