'అడవారి మాటలకు అర్థాలు వేరులే' చిత్రం తర్వాత వెంకటేష్, త్రిష మరోసారి జంటగా కలిసి నటిస్తున్న 'నమో వెంకటేశ' చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుస హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటల్లో ఒక పాట చిత్రీకరణ ప్రస్తుతం నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతోంది. వెంకటేష్, త్రిష ఇందులో పాల్గొంటున్నారు. జనవరి 2న మరో పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది.వెంకటేష్ తో కలిసి పనిచేయాలనే కోరిక ఈ చిత్రంతో తీరనుందనీ, అలాగే తన మిత్రులు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం సంతోషంగా ఉందనీ శ్రీనువైట్ల ఇటీవల తెలిపారు. తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కు ఎక్కువ సమయం పట్టిందనీ, అలాగే దేవీశ్రీప్రసాద్ చక్కటి సంగీతం ఇవ్వడం, షూటింగ్ వేగంగా జరగడానికి కెమెరామన్ ప్రసాద్ మూరెళ్ల అనుభవం ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. ఇందులో తన పాత్ర పేరు పర్వతనేని వెంకట రమణ అనీ, చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ వెంకటేష్ చెప్పారు. వెంకటేష్ తో సమానంగా పూర్తి స్థాయి పాత్రలో ప్యారిస్ ప్రసాద్ గా బ్రహ్మానందం నటిస్తున్నారు. చింతపల్లి రమణ మాటలు అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
No comments:
Post a Comment